దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. చత్తీస్ గడ్ లోని పూర్వ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలోని అభూజామఢ్ ఏరియాలో మావోయిస్టులు తిరుగులేని పట్టు సాధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలను నిలువరించేందుకు పారా మిలటరీ బలగాలు, బస్తర్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్స్ నక్సల్స్ చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. గత సంవత్సరం వరకు కీకారణ్యంలోకి వెల్లేందుకు సానుకూల వాతావరణం లేకపోగా… ఆ తరువాత బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు అటవీ ప్రాంతంపై మావోయిస్టులు కన్నేశారన్న విషయాన్ని పసిగట్టిన నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట నాలుగేళ్లలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. అభూజామడ్ అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునే పరిస్థితులు లేవని గమనించిన మావోయిస్టు పార్టీ నాయకత్వం సేఫ్టీ జోన్లను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణలోని పలు ఏరియా కమిటీల ఉనికి కూడా వెలుగులోకి వస్తుండడం గమనార్హం. కొంతకాలంగా తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మావోయిస్టులు ఇటీవల కాలంలో ఇక్కడ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో కొన్ని ఏరియా కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ అవి మాత్రం చత్తీస్ గడ్ లోని భద్రకాళి ఏరియా అటవీ ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. కానీ తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలను గమనిస్తే మాత్రం నక్సల్స్ చాపకింద నీరులా వ్యవహరిస్తూ పార్టీని పటిష్టం చేసే విధంగా ముందుకు సాగుతున్నట్టుగా అర్థం అవుతోంది.
సరిహద్దుల్లోనే బ్రేకులు…
ఏటూరునాగరం, మహదేవపూర్ ఏరియా కమిటీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలో కూడా కార్యకలాపాలు కొనసాగించేందుకు మంగీ ఏరియా పేరిట గతంలో కమిటీలను ఏర్పాటు చేసింది మావోయిస్టు పార్టీ. అయితే ఈ కమిటీల బాధ్యులు మాత్రం రాష్ట్రంలోకి వచ్చి సాయుధులుగా సంచరించే పరిస్థితి లేకుండా పోవడంతో దండకారణ్యంలోని షెల్టర్ జోన్లకే పరిమితం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీల పేరిట ప్రకటనలు విడుదలైనప్పటికీ మావోయిస్టులు మాత్రం తెలంగాణాలో షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకోలేకపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డీవీసీఎంలు మంగు, వర్గేష్, రాజు, భద్రులు మరణించారు. వీరిలో తెలంగాణ కమిటీ బాధ్యులు కూడా ఉన్నారని గడ్చిరోలి జిల్లా పోలీసులు ప్రకటించారు. అలాగే ములుగు జిల్లాను ఆనుకుని ఉన్న కర్రెగుట్ట వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో డీవీసీఎం సాగర్, మనీరామ్, లక్ష్మణ్ లు మరణించారు. వీరు కూడా రాష్ట్ర సరిహద్దుల్లో షెల్టర్ జోన్ లను ఏర్పాటు చేసుకుని తెలంగాణాలో పట్టు సాధించాలనే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారని నిఘావర్గాలు అనుమానించాయి. తాజాగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహధ్దు అటవీ ప్రాంతంలోని దామెరతోగు, అడవి రామారంలో జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ ములుగు జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన నల్లమరి అశోక్ అలియాస్ విజయేందర్ చనిపోయాడు.
యాక్షన్ టీమ్స్ ఎంట్రీ..?
తెలంగాణ సరిహధ్దు అటవీ ప్రాంతంలో మఫ్టీలో యాక్షన్ టీమ్స్ సంచరిస్తున్నాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి యాక్షన్ టీమ్ సభ్యులు వచ్చి సంచరిస్తున్నారన్న విషయాన్ని పోలీసులు పసిగట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దామెరతోగు వద్ద జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో కూడా యాక్షన్ టీమ్స్ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ప్రత్యేకంగా యాక్షన్ టీమ్స్ తిరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి రావడం గమనార్హం. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచలో డీవీసీఎం లచ్చన్న ఆధ్వర్యంలోని బృందం, ఇల్లందు, నర్సంపేట, గుండాల ఏరియాల్లో భద్రు టీమ్స్ ఆయా ప్రాంతాల్లో సంచరించి రెక్కి నిర్వహించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
గొత్తి కోయల కదలికలపై…
బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో నక్సల్స్ కు వ్యతిరేకంగా సల్వాజుడుం ఏర్పాటయింది. అక్కడి ఆదివాసీ తెగల్లో ఓ వర్గం మావోయిస్టులను అనుకూలంగా వ్యవహరిస్తుండగా, మరో వర్గం సల్వజుడూంతో కలిసి వ్యతిరేక పోరాటం చేసింది. ఈ నేఫథ్యంలో వందలాది మంది గొత్తి కోయల కుటుంబాలు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోకి వలస వచ్చి నివాసం ఉంటున్నాయి. అయితే వీరు మావోయిస్టుల సానుభూతి పరులన్న అనుమానంతో తెలంగాణ పోలీసులు సోదాలు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా వీరి సహకారంతోనే మావోయిస్టులు తెలంగాణాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దామెరతోగు వద్ద జరిగిన ఎన్ కౌంటర్ తరువాత యాక్షన్ టీమ్స్ ఉనికి వెలుగులోకి రావడం, ఈ బృందాలకు గొత్తి కోయలు షెల్టర్ ఇస్తున్నారని గుర్తించినట్టుగా వెలుగులోకి రావడం గమనార్హం. ఏది ఏమైనా మావోయిస్టులు తెలంగాణలోకి అడుగుపెట్టేందుకు కృతనిశ్చయంతో పావులు కదుపుతున్నట్టుగా మరోసారి స్పష్టం చేస్తోంది.