పదో తరగతి విద్యార్థికి బాసట
దిశ దశ, హైదరాబాద్:
కామ్రేడ్స్ కు కాషాయానికి అస్సలు పొసగదన్నది నిజం. వామపక్ష విప్లవ పంథాలో సాగే మావోయిస్టులు ఏనాడూ బీజేపీని అక్కున చేర్చుకోరు. హిందుత్వ నినాదానికి వ్యతిరేకంగానే తమ గళాన్ని వినిపిస్తారు నక్సల్స్. ఈ క్రమంలోనే కాషాయం పార్టీ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అవుతారు మావోయిస్టు పార్టీ నేతలు. మావోయిస్టు విషయంలో బీజేపీ నేతలు కూడా దాదాపు ఇదే విధానాన్ని కనబరుస్తుండడం సహజం. నక్సల్స్ వ్యతిరేక పోరాటంలో బీజేపీతో పాటు అనుభంద పార్టీల నేతలు కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సైద్దాంతికత విషయంలో ఇరు పార్టీలకు మధ్య అందనంత దూరం ఉంటుందన్నది కూడా నిజం. కానీ ఈ విషయంలో మాత్రం అటు కామ్రేడ్స్… ఇటు కాషాయం పార్టీ నాయకులు ఒకటే పల్లవి అందుకున్నారు. కమలాపూర్ లో మాల్ ప్రాక్టీస్ విషయంలో బలైన విద్యార్థికి బాసటగా మావోయిస్టు పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే గళాన్ని వినిపిస్తోంది. విద్యార్థిని ఐదేళ్ల పాటు డిబార్ చేసి జీవితాన్ని నాశనం చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని రెండు పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి.
మావోయిస్టుల ప్రకటన ఇలా…
టెన్త్ పేపర్స్ బయటకు రావడంపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాల కోసం విద్యార్థులను బలి పశువులు చేస్తున్నారని ఆరోపించారు. నీచ రాజకీయాల కోసం ప్రశ్న పత్రాలు లీక్ చేసిన సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లను శిక్షంచకుండా అమాయక విద్యార్థిని 5 ఏళ్ల పాటు డిబార్ చేయడం ఏంటని జగన్ ప్రశ్నించారు. విద్యార్థి చదువుకు ఆటంకం కలగకుండా డిబార్ రద్దు చేసి, ప్రశ్న పత్రాల లీకేజీలో రాజకీయాలు చేస్తున్న ఆయా పార్టీల నాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని, పేరెంట్స్ ఈ విషయంపై పోరాటం చేయాలని మావోయిస్టు జగన్ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
బీజేపీ స్టేట్ మెంట్ ఇది…
కమలాపూర్ కు చెందిన పదోతరగతి విద్యార్థి హరీష్ ను పేపర్ లీకేజీ విషయంలో డిబార్ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నీ కొడుకును పక్కకు పెట్టి అతన్ని డిబార్ చేస్తావా..? పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఎలా వెల్లిందో విచారణ చేయాలి, అబ్బాయి లైఫ్ కరాబు చేయవద్దన్నారు. కేసీఆర్ కొడుకు, బిడ్డ బాగుండాలి కానీ ఇంకోకరు మంచిగా ఉండొద్దన్నదే సీఎం ఉద్దేశ్యమని అన్నారు. స్క్వాడ్ ఎటు పోయింది, ఇతర యంత్రాంగం ఎటు పోయింది వాళ్లందరిపై చర్య తీసుకోకుండా అమాయకుడైన హరీష్ ను బలి చేశారన్నారు. సీఎం కేసీఆర్ చిన్న పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తాడని ఆరోపించిన బండి సంజయ్ హరీష్ ను డిబార్ చేయడం వెనక ఏం కుట్ర దాగి ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు.