కూంబింగ్ ఆపరేషన్ లో పట్టుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు
దిశ దశ, దండకారణ్యం:
సరిహధ్దు అటవీ ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. పొరుగునే ఉన్న చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతం నుండి మావోయిస్టులు తెలంగాణాలోకి చొరబడే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. ఉత్తర తెలంగాణాలో పునర్ వైభవం కోసం తహతహలాడుతున్న మావోయిస్టులను ఆదిలోనే చెక్ పెట్టాలన్న యోచనలో సరిహద్దు ప్రాంత పోలీసులు నిత్యం కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పూసుగుప్ప అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్న బలగాలకు ఎల్ఓఎస్ డిప్యూటీ కమాండర్ తో పాటు దళ సభ్యురాలు పట్టబడ్డారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీ జి వినిత్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీరిద్దరూ చత్తీస్ గడ్ లోని ఊసూరు ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. ఊసూరు ఎల్ఓఎస్ డిప్యూటీ కమాండర్ మడివి ఇడుమ (25), దళ సభ్యురాలిగా కుంజా దేవి అలియాస్ సరిత (23)లను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. డిప్యూటీ కమాండర్ గా పని చేస్తున్న మడివి ఇడుమ సుక్మా జిల్లా జేగురు గొండ ఏరియా భీమాపురం గ్రామానికి చెందిన వాడని వివరించారు. 2010లో బాలల సంఘంలో పనిచేస్తున్న మడివి 2017లో ఊసురు ఎల్ఓఎస్ దళ సభ్యునిగా పనిచేస్తూ 2012లో డిప్యూటీ కమాండర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని ఎస్పీ వినిత్ వివరించారు. బీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేఖపల్లి ఊసూరుకు చెందిన కుంజా దేవి అలియాస్ సరిత 2021 నుండి ఎల్ఓఎస్ మెంబర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. వీరు తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దు అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలను బలవంతంగా సమావేశాలకు తీసుకెళ్తున్న క్రమంలో పట్టుకున్నామని వెల్లడించారు. వీరిద్దరూ పలు విధ్వంసకర సంఘటనల్లో పాలు పంచుకున్నారని ఎస్పీ వివరించారు.
సిద్దాంతాలు గాలికి: ఎస్పీ జి వినిత్
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు సిద్దాంతాలు గాలికి వదిలేశారని కొత్తగూడెం భద్రాద్రి ఎస్సీ జి వినిత్ ఆరోపించారు. తమకు పట్టుబడిన మావోయిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం కింది స్థాయి క్యాడర్ ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న క్యాడర్ కు ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ సరిహద్దుల్లోని ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్పీ ఆరోపించారు. డబ్బులు ఇవ్వనట్టయితే బూబి ట్రాప్స్, ఐఈడీలు అమర్చుతూ ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతుండడం వల్ల వన్య ప్రాణుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధిత మావోయిస్టులకు ఎవరూ సహకరించకూడదని ఎస్సీ వినిత్ కోరారు. వారితో చేతులు కలిపినట్టయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post