దిశ దశ, హుస్నాబాద్:
హుస్నాబాద్ లో నిర్మించిన అతిపెద్ద స్థూపం తాలుకు భూమి తమదేనంటూ మావోయిస్టు పార్టీ జెఎండబ్లూపి డివిజన్ కార్యదర్శి వెంకటేష్ స్పష్టం చేశారు. స్మారక స్థూపం కోసం దివంగత డీఎస్పీ రాంచంద్రారెడ్డి ఇచ్చారని వెల్లడించారు. 4 ఎకరాల భూమిని ఆయన కొడుకు రాజేశ్వర్ రెడ్డి రూ. 25 కోట్లకు అమ్ముకున్నాడని, అతనికి డబ్బులు ఇచ్చిన వారు వాపస్ తీసుకోవాలని వెంకటేష్ కోరారు. 1990లో అమరవీరుల త్యాగాలను స్మరించుకునే విధంగా ఆసియాలోనే అతిపెద్ద స్థూపం నిర్మించామని అయితే దానిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గ్రీన్ టైగర్స్, క్రాంతి సేనలు డైనమేట్లతో పేల్చివేశారన్నారు. 1189 సర్వే నెంబర్ లోని 4 ఎకరాల స్థలంలో స్థూపాన్ని 1990లో పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అయితే ఉద్యమం బలహీన పడడంతో 2022లో ఈ భూమి పట్టాదారుడైన రాంచంద్రారెడ్డి వారసుడు రాజేశ్వర్ రెడ్డి రూ. 25 కోట్లకు అమ్ముకున్నాడని వాస్తవంగా ఈ భూమిని పార్టీ ఎవరికి అమ్మలేదని వెంకటేష్ స్పష్టం చేశారు. తమకు దివంగత డీఎస్పీ రాంచద్రారెడ్డి ఆ భూమిని ఇచ్చారని దీనిని కొనుగోలు చేసిన వారు వెంటనే డబ్బులు వెనక్కి తీసుకోవాలని సూచించారు.