ఒడిషా టు కరీంనగర్

మావోయిస్టు డీసీఎం లొంగుబాటు

దిశ దశ, కరీంనగర్:

మావోయిస్టు పార్టీ డీసీఎం నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క కరీంనగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుబ్బరాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన జ్యోతి (38) రెండు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారని డీసీఎం హోదాలో ప్రెస్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని మంగి ఏరియాలో పనిచేసిన జ్యోతి 2011లో జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకుని మావోయిస్టు పార్టీ నేత జంపన్నతో కలిసి ఒడిషాకు వెల్లి అక్కడి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నదని వివరించారు. ఒడిషాలో ప్రెస్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్న సమమంలో ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ ను వివాహం చేసుకోగా వీరిద్దరి మద్య వచ్చిన విబేధాల కారణంగా విడిపోయారన్నారు. మొత్తం ఐదు కేసుల్లో ఉన్న జ్యోతి ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమంలో భాగంగా లొంగిపోయినట్టు సీపీ వెల్లడించారు.

జనంలోకి రండి: సీపీ సుబ్బరాయుడు

చత్తీస్ గడ్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న మావోయిస్టులు ఆదివాసీ బిడ్డలను వదిలేసి జనజీవనంలో కలవాలని సీపీ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. అమాయకుల జీవితాలతో చెలగాటమాడకూడదని, మైనర్లను కూడా పార్టీ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన నక్సల్స్ కు ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. అడవిని వదిలి జనంలోకి వచ్చి సాధారణ జీవనం సాగిస్తే ప్రభుత్వం తరుపున అందించే పునరావసం స్కీంలను అమలు చేస్తామని సీపీ ప్రకటించారు.

పుష్కర కాలం ఏమైనట్టో..?

జ్యోతి లొంగుబాట విషయంలో ఓ విషయం క్లారిటీ లేకుండా పోయింది. 2012లో తన జీవిత భాగస్వామి ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ తో విడిపోయిన తరువాత ఒడిషా పార్టీ కార్యకలాపాలకు జ్యోతి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఇంత కాలంలో ఎక్కడ ఉందన్నదే పజిల్ గా మారిపోయింది. అయితే పార్టీతో సంబంధాలు లేకుండా ఉన్న జ్యోతి చత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో ఉపాధి పొందుతూ కాలం వెల్లదీసినట్టుగా తెలుస్తోంది. ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న ఆమె ఉనికి వెలుగులోకి రావడంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేయూత ద్వారా లొంగిపోయేందుకు ఒప్పించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తరుపున ప్రెస్ ఇంఛార్జీగా జ్యోతి వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తోంది.

You cannot copy content of this page