దిశ దశ, వరంగల్:
దండకారణ్య అటవీ ప్రాంతంతో పాటు ఉత్తర తెలంగాణాలో మావోయిస్టు పార్టీ పేరిట విడుదల అవుతున్న లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. బస్తర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ఘటనల తరువాత మీడియా వద్దకు వస్తున్న లేఖలు నకిలీవని, మావోయిస్టు పార్టీ విడుదల చేయలేదన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఇదే క్రమంలో మావోయిస్టు పార్టీ పేరిట వరంగల్ అజాం జాహి మిల్స్ కార్మిక భవనంపై వచ్చిన లేఖపై చర్చ సాగుతోంది.
DKలో…
బస్తర్ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురు కాల్పల ఘటనల్లో వచ్చిన లేఖలపై చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సరిహధ్దుల్లోని కర్రి గుట్టల సమీపంలో మావోయిస్టు పార్టీ నేత బడే దామోదర్ డెన్ ఏర్పాటు చేసుకున్నారని సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ ఘటనలో కొంతమంది నక్సల్స్ హతమయ్యారని అక్కడి పోలీసు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ నేత గంగా పేరిట ఓ లేఖ విడుదల కావడం సంచలనంగా మారింది. ఈ లేఖలో బడే దామోదర్ ఎన్ కౌంటర్ లో చనిపోయారని ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్టుగా ప్రకటన వెలువడింది. అయితే ఈ లేఖ అంతా బూటకమన్న వాదనలు వినిపించగా ఆ తరువాత బడే దామోదర్ క్షేమంగా ఉన్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పార్టీ పేరిట నకిలీ లేఖ మీడియాకు విడుదలైనట్టుగా స్పష్టం అయింది. చత్తీస్ గడ్ లోని గరియాబంద్, ఒడిషాలోని నౌపాడ జిల్లాలను అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మరణించారు. చలపతి మరణం తరువాత కూడా ఆయన ప్రస్థానాన్ని వివరిస్తూ మావోయిస్టు పార్టీ పేరిట లేఖ విడుదల కాగా ఈ లేఖ కూడా పార్టీకి సంబంధం లేకుండానే వైరల్ అయిందన్న వాదనలు వినిపించాయి.
వరంగల్ లో…
ఇకపోతే వరంగల్ లో తెలంగాణాకే తలమానికమైన అజం జాహి మిల్స్ కార్మికులకు ఓ భవనం ఉండేది. ఈ భవనం స్థలం లీజుకు ఇచ్చారని అది తనకు చెందినదేనని గొట్టిముక్కల నరేష్ రెడ్డి వరంగల్ కు చెందిన ఓం నమశ్శివాయ అనే వ్యాపారికి విక్రయించారు. కార్మికులకు చెందిన ఈ భూమికి సంబంధించి నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేశారని లేబర్ యూనియన్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మావోయిస్టు పార్టీ పేరి… ఓ ప్రకటన విడుదల చేసి అప్పటి ఎమ్మెల్యేతో పాటు పలువురి పేర్లను ఊటంకిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలకు దిగింది. తాజాగా మావోయిస్టు పార్టీ పేరిట మరో లేఖ విడుదల కాగా కార్మిక సంఘం నాయకుడు నాగరాజు, సుప్రీంకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తో పాటు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. తనను టార్గెట్ చేసి లేఖ విడుదల చేయడం సరికాదని, ఈ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని కార్మిక సంఘం నేత నాగరాజు తేల్చి చెప్పారు. మరో వైపున సుప్రీం కోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కూడా ఈ ప్రకటనపై వివరణ ఇస్తూ ఈ భవనం స్థలానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. కొంతమంది కార్మిక నాయకుల వైఖరిని ఖండిస్తున్నాని ప్రకటించారు. అయితే గతంలో ఏనాడూ లేని విధంగా అసలు బాధ్యులను కాకుండా ఇతరుల పేర్లను మావోయిస్టు పార్టీ ప్రస్తావించిన దాఖలాలు లేనందున ఆ లేఖ మావోయిస్టు పార్టీ నుండి విడుదల అయిందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కార్మిక సంఘం భవనానికి సంబంధించిన రికార్డులను రెవెన్యూ అధికారులు కూడా పరిశీలన చేస్తున్న క్రమంలో ఆ భూమిలో నిర్మాణాలు మొదలు కావడంతో రెండో సారి లేఖ విడుదల అయిందని అనుకుంటున్నారు. అయితే ఆ లేఖ నిజంగానే మావోయిస్టు పార్టీ విడుదల చేసిందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. తెలంగాణలోని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోవడంతోనే ఈ పరిస్థితి తయారైందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతుండడం గమనార్హం. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం భూమికి సంబంధించిన వివరాలపై క్లారిటీ లేకుండా పోయిందని, ఇందుకు సంబంధించిన రహస్య నివేదిక కూడా ఉన్నతాధికారులకు పంపిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. సొసైటీతో పాటు ఉన్నతాధికారుల వద్ద తామెందుకు చులకన కావడం ఎందుకన్న యోచనతో రెవెన్యూ విబాగంలోని కొంతమంది అధికారులు చర్చించుకుంటున్నట్టుగా సమాచారం. అయితే భూమి యజమానికి రెవెన్యూ రికార్డ్స్ విభాగం నుండి సర్టిఫికెట్ రావడానికి కారణం ఏంటి..? అక్కడ ఉన్న రికార్డులను కూడా పరిశీలించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి విడుదలైన లీజ్ అగ్రిమెంట్ పేపర్ విషయంపై కూడా సమగ్రంగా తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. విషయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పేరిట అజాం జాహి మిల్స్ కార్మిక భవన స్థలంపై తరుచూ వస్తున్న ప్రకటనల వెనక అసలేం జరుగుతోంది..? దీని వెనక ఉన్న మతలబు ఏంటీ అన్న చర్చ అయితే స్థానికంగా సాగుతోంది. ఈ అంశంపై మావోయిస్టు పార్టీ నాయకత్వం స్ఫష్టత ఇస్తే తప్ప వాస్తవం తెలిసే అవకాశం లేదంటున్నారు కొందరు.