దండకారణ్య అటవీ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తున్నారని దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆరోపించింది. పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్న వైమానిక దాడులను మావోయిస్టు పార్టీ ఖండించింది. బస్తర్ ప్రజలపై విధించిన యుద్దానికి వ్యతిరేకంగా ఏకమై గళమెత్తాలని పిలుపునిచ్చింది. తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు డ్రోన్, హెలిక్యాప్టర్ల ద్వారా సరిహద్దు ప్రాంతాలైన పామేడె, కిస్తారం, మడ్కన్ గూడ, మెట్టగూడ, బొట్టెలోగ్, సకిలేర్, మడ్పాడులాడే, కన్నెమార్క, పొట్టేమంగుం, బొట్టల్క, కాసపల్లి, ఎర్రపాడ్ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉదయం 11 గంటల నుండి దాడులు చేశారని ఆరోపించింది. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతాంలోని కొండలపై బంబుల వర్షం కురిపించారని, గత ఏడాది ఏప్రిల్ 15న కూడా బాంబుల దాడి చేశారని పేర్కొంది. జనవరి 11 ఉదయం ప్రారంభం అయిన వైమానిక దాడి ఇప్పటికీ కొనసాగుతోందని, మావోయిస్టు పార్టీ నాయకత్వంతో పాటు పీఎల్జీఏ కు హానీ కల్గించే లక్ష్యంతో వందలాది బాంబులు వేస్తున్నారని మండిపడింది. పగలు రాత్రి హెలిక్యాప్టర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికల లోపు మావోయిస్టులను తూడిచి పెడ్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారన్న విషయాన్ని సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ గుర్తు చేసింది. చత్తీస్ గడ్ లోని గిరిజన, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదదర్శకత్వంలో తమ పార్టీ, పీఎల్జీఏ, మాస్ కమిటీలు, ప్రజలను చుట్టుముట్టి నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ప్రచారాలు చేపట్టినప్పుడు తమ లక్ష్యం సాధించుకునేందుకు ముప్పేట దాడులు చేస్తున్నాయని, భీకరంగా సాగుతున్న బాంబుల దాడుల కారణంగా ప్రజలు బయటకు వెల్లలేని పరిస్థితి నెలకొని ఉందని ఆ ప్రకటనలో వివరించింది. వరికొత పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ క్రమంలో బాంబు దాడులు జరుగుతుండడంతో భయానక వాతావరణం నెలకొని ఉందని, ఈ రకమైన దాడులను ముక్త కంఠంతో ఖండించాలని సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగానది ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.