దిశ దశ, దండకారణ్యం:
పీపుల్స్ వార్ ప్రస్తానం నుండి అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టు పార్టీ క్యాడర్ ను గుర్తించలేకపోతున్నారా..? జనజీవనానికి దూరంగా కీకారణ్యాల్లోనే ఉంటున్న నక్సల్స్ నాయకులు ఎవరో తెలుసుకునేందుకు బలగాలు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో మరణించిన మావోయిస్టు పార్టీ శ్రేణులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. చత్తీస్ గడ్ లోని ప్రభావిత ప్రాంతాల్లో నక్సల్స్ ఏరివేత కోసం ఆపరేషన్ ‘కగార్’ నిర్వహిస్తున్న బలగాలు జరుపుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నాయకులు కోల్పోతున్న సంగతి తెలిసిందే.
చలపతి మరణంతో…
చత్తీస్ ఘడ్, ఒడిషా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా (CCM) బాధ్యతలు నిర్వర్తిస్తున్న చలపతి అలియాస్ జయరాంతో పాటు పలువురు నక్సల్స్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే రామచంద్రారెడ్డి అలియాస్ చలపతిని గుర్తించే విషయంలో పోలీసులు ఆరా తీయాల్సి వచ్చింది. కల్హారిఘాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఫోటోల ఆధారంగా ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులు తెలుసుకునే పనిలో పడాల్సి వచ్చింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలగుట్టపల్లికి చెందిన మావోయిస్టు నేతగా అనుమానించి ఆ గ్రామంలో కూడా ఆరా తీశారు పోలీసులు. ఒడిషా కమిటీతో ఉన్నది చలపతి అని నిర్దారించుకునేందుకు దాదాపు ఒక రోజు పట్టినట్టుగా తెలుస్తోంది. ఇదే ఘటనలో చనిపోయిన మరో నక్సల్ నేతను DKSZC సభ్యుడు చంద్రహాస్ అలియాస్ ప్రమోద్ అలియాస్ పాండుగా మొదట పోలీసులు భావించారు. గురువారం సాయంత్రం ఆయన చంద్రహాస్ కాదని గరియాబంద్ జిల్లాలోని ధమ్ తరీ, గరియాబంద్, నౌపాడ డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఒడిషా రాష్ట్ర కమిటీ సభ్యుడు సత్తయం గావ్డే అని ప్రకటించారు. అంతేకాకుండా ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మనోజ్ కూడా ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయినట్టుగా మొదట అనుమానించిన పోలీసులు ఆ తరువాత ఆయన లేడని నిర్ధారించారు. సుదీర్ఘ కాలంగా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులను గుర్తించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలుస్తోంది. ముఖ్య నాయకులకు సంబంధించిన ఫోటోలు 1980, 90లలో తీసినవి పోలీసు రికార్డుల్లో ఉండడం కూడా కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా సమాచారం.
నో మొబైల్స్…
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజ్ఞాత నక్సల్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండాలన్న కారణంగా వినియోగిస్తున్న మొబైల్ ఫోన్స్ పార్టీ నాయకత్వం మరణానికి కారణం అవుతున్నాయని బావిస్తున్నట్టు సమాచారం. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని తుద ముట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తాము వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లే తమను పట్టిస్తున్నాయని పార్టీ భావిస్తోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న నిఘా వర్గాలు నక్సల్స్ నేతలు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకుంటున్నారన్న ఆందోళన పార్టీలో మొదలైంది. తాజాగా చత్తీస్ గడ్ రాష్ట్రంలో జరుగుతున్న వరస ఎన్ కౌంటర్లతో పార్టీ శ్రేణులను కోల్పోతున్నందున సెల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనే సెల్ ఫోన్లు వినియోగించకూడదని నక్సల్స్ నేతలు అన్ని ప్రాంతాలకు సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఎంచుకున్న షెల్టర్ జోన్ల నుండి కూడా బయటకు రాకూడదని బలగాల కంటపడకూడి ప్రాణాలు కోల్పోవద్దన్న సంకేతాలను కూడా సీసీ కమిటీ పంపించినట్టుగా తెలుస్తోంది.