దిశ దశ, మేడారం:
ఆదివాసీల ఆరాధ్య దేవతలIగా వెలుగొందుతున్న మేడారం జాతర సౌకర్యాలపై మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకట విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ జెఎండబ్లూపి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వ తీరును ఎండగట్టరు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు ఆదివాసీ బిడ్డలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు హాజరవుతారని, సమ్మక్క, సారలక్కలను భక్తులు పెద్ద సంఖ్యలో ఆరాధిస్తారన్నారు. కాకతీయ రాజులు ఆదివాసీల వద్ద అధిక మొత్తంలో పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేయడంతో సమ్మక్క, సారలక్కలు తిరుగుబాటు చేశారని వెంకటేష్ అన్నారు. పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వనదేవతలు అసువులు బాయడంతో ఆదివాసీలంతా కూడా సమ్మక్క సారలక్కలన పూజిస్తున్నారన్నారు. ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే ఈ జాతరకు నాలుగు రాష్ట్రాలలోని కోటి మంది భక్తులు వస్తారని, వీరి ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆదాయాన్ని ఆదివాసీ ప్రాంతాల్లోనే వెచ్చించి అభివృద్ది చేయవచ్చు కానీ ఆ నిధులను దారి మళ్లించడంతో ఆదివాసీలు పేదలుగానే మిగిలిపోతున్నారని మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ముందుస్తుగానే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. జాతర దగ్గర పడుతున్న సమయంలో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారి నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని వెకంటేష్ ఆరోపించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం మౌళిక సదూపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎధుర్కొంటున్నారన్నారు. పన్నులు వసూలు చేస్తూ కూడా సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగిపోతున్నారని ఆరోపించారు. మేడారం జాతర ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మేడారం జాతరను ఆదివాసి సాంప్రాదాయలతో మాత్రమే నిర్వహించాలని, హిందూ సాంప్రాదాయాలపై లడ్డూ, పులిహోర లాంటి ప్రసాదాలు కాకుండా బెల్లం మాత్రమే ఇవ్వాలని వెంకటేష్ సూచించారు. జాతర పూర్తయిన తరువాత ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి అనారోగ్య వాతావరణం లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనారోగ్యం బారిన పడిన వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని, జాతర కోసం విడిచి పెట్టిన పంట పొలాలకు పరిహారం ఇవ్వాలని మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి డిమాండ్ చేశారు. పంట పొలాల్లో బ్రాందీ సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు.