దిశ దశ, భద్రాద్రి:
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న నక్సల్స్ జనజీవనంలో కలుస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ పోలీసు అధికారుల ముందు సరెండ్ అవుతున్నారు. తాజాగా 64 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ విభాగాల్లో పని చేస్తున్న నక్సల్స్ మల్టీజోన్_1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముందు లొంగిపోయారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐజీ ముందు చత్తీస్ గడ్ లోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మావోయిస్టు పార్టీ నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఆపరేషన్ చేయూతలో భాగంగా వీరు వనాలను వీడి జనారణ్యంలోకి వచ్చారని ఐజీ ప్రకటించారు. పోలీసుల ముందు సరెండర్ అయిన వారిలో ACM మెంబర్, పార్టీ సభ్యులు 10 మంది, RPC సభ్యులు 19 మంది, DAKMS/KMSకు చెందిన వారు 11 మంది, RPC CNMలు ఆరుగురు, RPC GRD 8మంది ఉన్నారు.
122 మంది…
ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క భద్రాద్రి జిల్లా పోలీసుల ముందే 122 మంది మావోయిస్టు పార్టీ నక్సల్స్ లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. వీరిలో DVCM ఒక్కరు, ACMలు నలుగురు, పార్టీ సభ్యులు 14 మంది, PCCMలు ఇద్దరు, మిలీషియా సభ్యులు 44 మందితో పాటు వివిధ క్యాడర్ లలో ఉన్నవారు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అంధిస్తున్న ప్రోత్సాహంతో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోందని వివరించారు. కాలం చెల్లిన సిద్దాంతాలతో పోరాట పంథాలో సాగుతున్న మావోయిస్టులు ఆదివాసీ ప్రాంతాల అభివృద్దిని నిలువరిస్తున్నాయని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఆరోపించారు. అమాయక ఆదివాసీలు సంచరించే ప్రాంతాల్లో మందుపాతరలు అమర్చుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. నక్సల్స్ అమర్చిన మందుపాతర వల్ల ఇటీవల ఓ ఆదివాసి మహిళ కాలును కోల్పోయిందన్నారు. జనజీవనంలో కలిసిన వారికి పునరావాసం కల్పిస్తామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజా, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.