14 మంది జవాన్లకు గాయాలు… మగ్గురి మృతి…
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతలతో దద్దరిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులోని టేకులగూడెం బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మృత్యువాత పడగా, 14 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం జగదల్‌పూర్‌కు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా అక్కడి అటవీ ప్రాంతం నుండి అందుతున్న సమాచారం ప్రకారం… బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని టేకులగూడెంలో ఇటీవల బలగాలు కొత్తగా క్యాంపును ఏర్పాటు చేశాయి. ఈ క్యాంపులో కోబ్రా, STF, DRG బలగాలు అవాసం ఉంటూ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ఇలాకాలోకి చొచ్చుకపోవాలన్న లక్ష్యంతో బలగాలు ఇటీవల దండకారణ్య అటవీ ప్రాంతంలో కొత్తగా క్యాంపులను ఏర్పాటు చేసింది. అందులో టేకులగూడెం క్యాంపు ఒకటి కాగా ఇక్కడి నుండి బలగాలు మావోయిస్టులను ఏరివేసే చర్యలు తీవ్రంగా చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం గాలింపు చర్యలు చేపట్టిన బలగాలపై మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. అనంతరం టేకులగూడెం క్యాంపుపై కూడా పీఎల్జీఏ దళాలు ముప్పేట దాడి చేసినట్టుగా తెలుస్తోంది. జవాన్ల కదలికలపై ముందుగానే రెక్కి నిర్వహించుకున్న మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో భధ్రతా బలగాలపై పట్టు సాధించాలన్న వ్యూహంతో కార్యరంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అయితే క్యాంపులో అప్రమత్తంగా ఉన్న బలగాలు మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు ఎదురు దాడికి దిగాయి. ధీంతో మావోయిస్టులు, బలగాల మధ్య హోరాహోరి కాల్పులు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు చనిపోయారని, 14 మంది గాయపడ్డారని తెలుస్తోంది. గాయాల పాలైన జవాన్లను హెలిక్యాప్టర్ ద్వారా జగదల్‌పూర్‌కు ఆసుపత్రికి తరలించారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 2021లో కూడా టేకులగూడెం అటవీ ప్రాంతంలో నక్సల్స్ శిబిరంపై బలగాలు దాడి చేయగా మావోయిస్టులు కూడా ఎదరు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 23 మంది జవాన్లు మరణించారు. మంగళవారం బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేయడంతో ముగ్గురు జవాన్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బస్తర్ జోన్ పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.