దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. కీకారణ్యల్లో ఒక చోట నుండి మరో చోటకు వెల్తున్న క్రమంలో నదులు దాటడం ఇబ్బందిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు బోట్లను పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రెండు బోట్ల స్వాధీనం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లోని చింతగుప్పా, బోధనెల్లి సమీపంలో తెలంగాణాకు చెందిన ఏరియా డామినేషన్ పార్టీ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఆ ప్రాంతంలో ఒక డీసీఎం, రెండు ట్రాక్టర్లు. నలుగురిని పార్టీ గుర్తించింది. వాటిని పరిశీలించిన డామినేషన్ పార్టీ రెండు బోట్లు, కార్డెక్స్ వైర్ బెండిల్స్, ఒక డీసీఎం వ్యాను, రెండు ట్రాలీతో ట్రాక్టర్లు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుంది. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జారపల్లికి చెందిన పోడియం సమ్మయ్య (40), గట్టుపల్లి రమేష్ (20), సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మగూడెం గ్రామానికి చెందిన పూనెమ్ రూపేష్ (19), వెడమ శ్రీను (31)లను అరెస్ట్ చేశారు.
నదులు దాటేందుకు…
చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదులను దాటేందుకు బోట్లను కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ, మావోయిస్టు పార్టీ బెటాలియిన్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మావోయిస్టు పార్టీ నక్సల్స్ కోసమే ఈ బోట్లను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చింతవాగు, తాలిపేరు వాగుల మీదుగా ప్రయాణం చేసేందు కోసం ప్రత్యేకంగా బోట్లను కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. జల రవాణా ద్వార రాకపోకలు సాగించేందుకే నక్సల్స్ వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
తనిఖీల ప్రభావమా..?
దండకారణ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత కోసం బలగాలు పెద్ద ఎత్తున మోహరించిన సంగతి తెలిసిందే. దీంతో మావోయిస్టులు ప్రత్యామ్నాయ ప్రాంతాలపై దృష్టి సారించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. భద్రాద్రి, ములుగు జిల్లాల సరిహద్దు ప్రాంతాలను షెల్టర్ జోన్లుగా చేసుకోవాలని మావోయిస్టులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో పాటు సరిహద్దు ప్రాంతాల మీదుగా వాహనాల్లో రాకపోకలు కూడా నక్సల్స్ కు ఇబ్బందికరంగా మారాయి. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో పోలీసు అధికారులు డేగ కళ్లతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఏ మాత్రం అనుమానం వచ్చిన మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు కార్యరంగంలోకి దూకుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చింతవాగు, తాలిపేరు నదుల మీదుగా తెలంగాణాకు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా బోట్లను కొనుగోలు చేశారని అనుమానిస్తున్నారు.
తొలిసారేనా..?
అయితే తాజాగా భద్రాద్రి జిల్లా పోలీసులు బోట్లు పట్టుకోవడంతో పార్టీ రవాణా సౌకర్యాల విషయంలో కొత్త పంథాలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. జల రవాణా మార్గాలను ఎంచుకుని నదులను దాటినట్టయితే పోలీసులకు ఈజీగా చిక్కే అవకాశం ఉండదని భావించే రెండు పడవలు రాజమండ్రిలో కొనుగోలు చేసి ఉంటారని అనుకుంటున్నారు. అయితే గతంలో నది పరవాహక ప్రాంతానికి చేరుకున్న తరువాత నమ్మకమైన వారి పడవలు, తెప్పల ద్వారా నదులను దాటే ఆనవాయితీ కొనసాగించే వారు నక్సల్స్. తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న తరువాత ప్రత్యేకంగా బోట్లను కొనుగోలు చేసేందుకు మావోయిస్టులు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలకు వీటిని అప్పగించినట్టయితే అవసరం పడినప్పుడు తాము కూడా వినియోగించుకునే విధంగా ఉంటుందనే పడవలు కొనుగోలు చేశారని అంచనా వేస్తున్నారు. జల మార్గాల గుండా రాకపోకలు సాగిస్తే బలగాలు అంతగా గుర్తించే అవకాశం ఉండదని, అనుకూలమైన సమయంలో సరిహద్దులు దాటాలన్న యోచనలోనే వీటిని కొనుగోలు చేశారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తాజాగా పడవలను పోలీసులు సీజ్ చేయడంతో ఇదే తొలిసారా లేక గతంలో కూడా కొనుగోలు చేసి వాడుకుంటున్నారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. దండకారణ్య అటవీ ప్రాంతంలో ఇంద్రావతి, తాలిపేరు, చింతవాగులే కాకుండా చిన్నా చితకా వాగులు వంకలు పెద్ద ఎత్తున ఉన్నందున దాటేందుకు ఎదురయిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇంతకు ముందు కూడా బోట్లను కొనుగోలు చేశారా అన్న అనుమానం పోలీసుల్లో వ్యక్తం అవుతోంది. ఇటీవల దండకారణ్యంలో ఆపరేషన్ జలశక్తి పేరిట బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆఫరేషన్లకు స్వీకారం చుట్టి కీకారణ్యంలో ఉన్న మావోయిస్టుల షెల్టర్లపై కాల్పలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బలగాల కళ్లుగప్పి తప్పించుకునేందుకు అటవీ మార్గాలనే ఎంచుకుంటున్నారు నక్సల్స్. ఇలాంటి పడవలు అందుబాటులో ఉన్నట్టయితే బలగాల ఉనికిని పసిగట్టిన వెంటనే సేఫ్ జోన్ కు తరలిపోయేందుకు జల మార్గం ఎంచుకుంటే ఎలా ఉంటుంది అన్న యోచనలో కూడా మావోయిస్టులు ఉన్నారేమోనన్న చర్చ కూడా సాగుతోంది.