అజ్ఞాతంలో అన్నలు… ఆందోళనలో కుటుంబాలు…


దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం అంతా అజ్ఞాతంలో ఉంటే… వారి కుటుంబాలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా పార్టీ కేంద్ర కమిటీలో కొనసాగుతున్న వారంతా కూడా వయోభారంతోనే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్య నాయకత్వంలో ఎవరో ఒకరు మరణించారని బాహ్య ప్రపంచానికి తెలియగానే అజ్ఞాతంలో ఉన్న వారి కుటుంబాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా పెరిగిందని చెప్పక తప్పుదు. ముఖ్య నాయకత్వం అంతా కూడా దండకారణ్య అటవీ ప్రాంతంలోనే షెల్టర్ తీసుకోవడంతో అక్కడి నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ అంశంపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

నాడు ఎన్ కౌంటర్ల విషయంలో…

పీపుల్స్ వార్ కు ఉత్తర తెలంగాణ పెట్టని కోటగా ఉన్న సమయంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కొనసాగేది. నక్సల్స్, పోలీసు కార్యకలాపాలతో అట్టుడికిపోయిన ఆనాటి పరిస్థితుల్లో ఎదురు కాల్పులు జరుగుతున్నాయంటే చాలు చనిపోయిన క్యాడర్ ఎవరో అంతుచిక్కకుండా పోయేది. మొదట ఏ ఏరియాలో అయితే ఎదురు కాల్పుల ఘటన జరుగుతుందో ఆ ఏరియా కమాండర్ సహా ముఖ్య నేతలు చనిపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. కాల్పులు సద్దుమణిగిన తరువాత ఎన్ కౌంటర్ లో చనిపోయింది ఎవరోనన్న విషయం వెల్లడయ్యేది. హుజురాబాద్ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినప్పుడల్లా అనుపురం కొమురయ్య అలియాస్ ఎకె పేరో, పద్మక్క పేరో వినిపించేది. అలాగే పెద్దపల్లి పట్టణానికి చెందిన మలోజ్జుల బ్రదర్స్ పేరు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్ జరిగినప్పుడల్లా వినిపించేది. మంథని అటవీ ప్రాంతంలో అయితే చంద్రన్న పేరు, సందె రాజమౌళి పేరు ఇలా ఎదో ఒక పేరు వెలుగులోకి వచ్చేది. చివరకు పోలీసులు అజ్ఞాత నక్సల్స్ కుటుంబ సభ్యులను, మాజీలను పిలిపించి చనిపోయిన వారిని గుర్తించాల్సి వచ్చేది. కొయ్యూరు ఎన్ కౌంటర్ సమయంలో కూడా అగ్రనేతలు ఉన్నారంటూ ప్రచారం జరిగినప్పటికి వారెవరో తెలియక ఆరా తీయాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనల్లో అయినా, ఆదిలాబాద్ అడవుల్లో అయినా ఎదురు కాల్పులు జరిగితే చాలు ముఖ్య నేతలు చనిపోయారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగేది. దండకారణ్య అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లలో కూడా కీలక నాయకులు చనిపోయారంటూ ప్రచారం జరగిన సందర్బాలు ఎన్నెన్నో.

నేడు దండకారణ్యం విషయంలో…

నేడు దండకారణ్య అటవీ ప్రాంతంలో ఏం జరుగుతుందో అంతుచిక్కకుండా పోతోంది. అగ్రనేతలు చనిపోయారంటూ ప్రచారం జరగడంతో అంతా నిజమని నమ్మాల్సి వస్తోంది. ఆ తరువాత పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిన తరువాత చనిపోయిన వారు ఎవరో బయటకు తెలుస్తోంది. ముందుగానే ఎవరో ఒక అగ్రనేత చనిపోయారంటూ ప్రచారం జరగడం ఆ తరువాత మావోయిస్టు పార్టీ నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడం వల్ల కూడా అయోమయానికి గురైన సందర్భాలు సాధారణంగా మారిపోయింది. చర్చల ప్రతినిధి ఆర్కె అలియాస్ రామకృష్ణ చనిపోయాడంటూ మొదట ప్రచారం జరిగినప్పటికీ… అప్పుడు మాత్రం చనిపోలేదని తేలింది. ఆ తరువాత కొంత కాలానికి ఆయన మరణించిన విషయాన్ని మావోయిస్ట్ పార్టీ ప్రకటించడంతో పాటు అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది. హరిభూషణ్ విషయంలో అయినా, ఇతర ముఖ్య నేతల విషయంలో అయినా ఇలాంటి ప్రచారమే జరిగింది. దీంతో ఆయా కుటుంబాలు అయోమయానికి గురవుతున్నారు. దశాబ్దాల క్రితం తమను వదిలేసి అడవి బాట పట్టిన తమ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో చనిపోయారన్న ప్రచారం జరుగుతుండడంతో బాహ్య ప్రపంచంలో ఉన్న వారు విషాదంలో కూరుకుపోతున్నారు. అయితే చనిపోయింది ఎవరన్న విషయం రోజుల తరబడి తెలియకపోవడంతో అగ్రనేతల కుటుంబాలు గందరగోళానికి గురవుతున్నాయి. ప్రధానంగా కేంద్ర కమిటీతో పాటు ఇతర ముఖ్య కమిటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారు ఏడు పదుల వయసుకు చేరుకోవడంతో అనారోగ్యం బారిన పడి చనిపోయారేమోనన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.

అధికారిక ప్రకటనే…

ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో చనిపోయిన నాయకత్వం గురించి పార్టీ అధికారికంగా ప్రకటించే విధానం అమలు చేస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, రామకృష్ణ అలియాస్ ఆర్కె, హరిభూషణ్ తదితర నేతలు చనిపోయిన తరువాత వారి అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసిన మావోయిస్టులు ఓ ప్రకటన కూడా పంపించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. చనిపోయిన నేతల అజ్ఞాత నేపథ్యం గురించి వివరిస్తున్నారు. అంతకు ముందు చనిపోయిన వారి వివరాలను వారి కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలియజేసే విధానాన్ని అవలంభించిన మావోయిస్టు పార్టీ ఆ తరువాత బహిరంగ ప్రకటన చేసే పద్దతికి శ్రీకారం చుట్టింది. అయితే తాజాగా మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న మరణించినట్టుగా గురువారం నుండి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది అజ్ఞాత నక్సల్స్ శవం ముందు ఏడుస్తున్నట్టుగా ఉండడంతో పాటు చనిపోయిన వ్యక్తి ముఖ కవలికలు కూడా రాజిరెడ్డిని పోలి ఉండడంతో ఆయన మరణించాడని శుక్రవారం ఉదయం నుండి ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరో వైపున కంది రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే మావోయిస్టు పార్టీ విధానం ప్రకారం ఒక వీడియో మాత్రమే విడుదల చేయడంతో చనిపోయింది ఎవరన్న క్లారిటీ లేకుండా పోయింది.

You cannot copy content of this page