గత వైభవం కోసం తహతహ…

NTSZC స్పెషల్ నజర్

మావోయిస్టుల వ్యూహం ఇదేనా..?

బ్రేకులు వేస్తున్న బార్డర్ పోలీసులు

దిశ దశ, దండకారణ్యం:

గెరిల్లా యుద్దతంత్రం వైపు సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా పతనం అయిన పార్టీకి పునరుజ్జీవం పోయాలని మావోయిస్టు పార్టీ తహతహలాడుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయినా కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నట్టుగా ఉంది. ఒకప్పుడు పీపుల్స్ వార్ కంచుకోటగా పేరుపడిపోయిన ఉత్తర తెలంగాణాలో పార్టీ అనూహ్యంగా పతనం అయింది. 2004 శాంతి చర్చల తరువాత నెలకొన్న పరిణామాలతో పార్టీ తీవ్రమైన నష్టాన్ని చవి చూసింది. ఇందుకు కారణాలు ఏమైనా సమాంతర ప్రభుత్వం దిశగా ముందుకు సాగుతున్న దశలో పార్టీ ఉనికే లేకుండా పోయింది.

పోయిన చోటే వెతుక్కోవాలనా..?

రూపాయి పోయిన చోటే వెతుక్కోవాలన్న నినాదాన్ని నక్సల్స్ గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలో సమూలంగా ఉనికి లేకుండా పోయిన పార్టీకి మళ్లీ జీవం పోయాలని ఎన్నో ప్రయత్రాలు చేస్తూనే ఉంది. ఉత్తర తెలంగాణలో వైఫల్యానికి కారణాలు ఏంటీ అన్న కోణంలో కేంద్ర కమిటీ ప్రత్యేకంగా నివేదికలు కూడా తెప్పించుకోవడంతో పాటు నిపుణులచే ఆరా తీయించిన సందర్బాలు కూడా లేకపోలేదు. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు ఇన్ ఫార్మర్ల పేరిట సరిహద్దు ప్రాంతాల్లో పలువురిని కాల్చి చంపడం, తాము జెండాలు పాతి నిరుపేదలకు పంచిన భూములను తిరిగి యజమానులు స్వాధీనం చేసుకుంటున్నారన్న విషయం తెలిసి వారిని టార్గెట్ చేయడం వంటి చర్యలకు పూనుకున్నప్పటికీ పోలీసుల కట్టుదిట్టమైన చర్యలతో మావోయిస్టు పార్టీ సాయుధ ధళాలను ఏర్పాటు చేసుకోలేకపోయింది. 1970వ దశాబ్దంలో ఉన్నత చదువులు చదివిన వారు సైద్దాంతిక నిర్మాణంతో అడవి బాట పట్టడంతో సక్సెస్ అయ్యామని భావించి మావోయిస్టు పార్టీ విశ్వ విద్యాలయల్లో నిర్మాణాత్మక రిక్రూట్ మెంట్ కు ప్రయత్నించి విఫలం అయింది. చివరకు తమ మాజీల సహాకరంతో చేయాలని కూడా విఫలం అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. సల్వా జూడుం, మావోయిస్టు పార్టీ మధ్య నెలకొన్న వార్ నేపథ్యలంలో కొంతమంది తటస్థులను సరిహద్దుల్లోకి పంపించింది. అయితే వీరంతా మావోయిస్టు పార్టీ సానుభూతిపరులని అనుమానించిన తెలంగాణ పోలీసులు పకడ్భందీగా వ్యవహరించడంతో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మళ్లీ మాజీ కొరియర్లు, పార్టీ సానుభూతిపరులను చేరదీసి వచ్చే ఎన్నికల్లో ఉనికిని చాటుకునే వ్యూహం రచిస్తున్నట్టుగా భావిస్తున్నారు.

పోలీసుల అప్రమత్తం…

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ భారీ వ్యూహాన్ని అమలు చేసే పనిలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో సరిహధ్దు ప్రాంతాల్లో పోలీసులకు చిక్కుతున్న కొరియర్లు, సానుభూతి పరుల అరెస్ట్ పరంపర కొనసాగుతుండడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మావోయిస్టుల కార్యకలాపాలు ఏ మాత్రం కనిపించిన సరిహద్దు ప్రాంత పోలీసు అధికారులు ముప్పేట దాడి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే దండకారణ్య ప్రాంతానికి చెందిన వారిని కూడా అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. సెప్టెంబర్ 21 నుండి మావోయిస్టు పార్టీ 19వ ఆవిర్భావ వారోత్సవాలు జరగునున్న నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ ప్రాంతాల్లోకి వచ్చిపోయే వారిపై నిఘా పెంచారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్ పల్లి కొరియర్లను అరెస్ట్ చేశారు. అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా మావోయిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ ఘటనలను బట్టి చూస్తే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సారి సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారే కాకుండా మైదాన ప్రాంతాలకు చెందిన వారిని కూడా పార్టీ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సరిహధ్దు పోలీసులు కూడా మావోయిస్టుల చర్యలకు ఆదిలోనే చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చాపకింద నీరులా కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే సరిహద్దు జిల్లాల పోలీసులు పై ఎత్తులు వేస్తూ మావోయిస్టుల చర్యలకు ఆదిలోనే బ్రేకులు వేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు కూడా పోలీసులను మరింత అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడ్డాయి.

You cannot copy content of this page