దిశ దశ, ములుగు:
సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు ఇద్దరిని హత్య చేశారు. ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తూ తమ ఉనికిని పోలీసులకు చేరవేస్తున్నారన్న కారణంగానే ఇద్దరిని హత్య చేశామని పార్టీ ప్రకటించింది. జిల్లాలోని వాజేడు మండలం పెనుగోలు కాలనీ పంచాయితీ కార్యదర్శి ఉయిక రమేష్ అతని సోదరుడు అర్జున్ లను గొడ్డళ్లతో నరికి చంపారు. మావోయిస్టు పార్టీ వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట ఘటనా స్థలంలో ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. వీరిద్దరూ పోలీసులకు మావోయిస్టుల కదలికలను చేరవేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
వేట ముసుగులో...
శికారు, చేపల వేట, గొడ్ల కోసం అంటూ ఇలా పలు రకాల పేర్లతో అడవుల్లో తిరుగుతూ తమ ఉనికిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని శాంత ఆ లేఖలో వెల్లడించారు. పద్దతులు మార్చుకోవాలని గతంలోనే హెచ్చరికలు జారి చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కారాణంగానే తాము అర్జున్ ను చంపివేశామని ప్రకటించారు.
రెండు లేఖలు…
అయితే వాజేడు మండల కేంద్రం సమీపంలోనే ఉన్న పెనుగోలు కాలనీకి చెందిన పంచాయితీ కార్యదర్శి రమేష్ ను చంపుతున్నట్టు మరో లేఖను కూడా మావోయిస్టులు వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన లేఖలను ఏరియా కమిటీ కార్యదర్శి శాంత విడుదల చేసినట్టుగా రెండు వేర్వేరుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఓ లేఖలో కేవలం అర్జున్ మాత్రమే తమ టార్గెట్ అన్నట్టుగా పేర్కొనగా… మరో లేఖలో రమేష్ పై ఆరోపణలు చేసింది మావోయిస్టు పార్టీ. రమేష్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ మండల కేంద్రానికి వెల్లి మావోయిస్టుల ఉనికిని పోలీసులకు తెలియజేస్తున్నాడని, క్రమక్రమంగా SIB పోలీసుల కంట్రోల్ కు వెల్లాడని ఆరోపించారు. చత్తీస్ గడ్ సరిహద్దుల్లోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శ్యామల దొడ్డి, వాయిపేటతో పాటు సమీప గ్రామాల్లోని బంధువులు, స్నేహితుల ద్వారా మావోయిస్టుల కదలికలను తెలుసుకుంటూ పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడని శాంత పేర్కొన్నారు. తమపై జరిగిన కొన్ని దాడులకు కూడా రమేష్ కారకుడని కూడా వెల్లడించారు. పెనుగోలు సమీపంలోని గుట్టపై ఎవరూ ఉండకూడదంటు ఒత్తిడి చేస్తున్నారని, వారిని నిరంతరం వేధిస్తున్నాడని ఆరోపించారు. మరో వైపున రెండు లేఖల్లో కూడా మ్యాటర్ బ్లూ పెన్ తో రాయగా, డేట్ మాత్రం గ్రీన్ పెన్ తో రాశారు. అందులో కూడా కేవలం తేది, సంవత్సరం మాత్రమే రాయగా, నెలను రాయకపోవడం గమనార్హం.
మండల కేంద్ర సమీపంలోనే…
ఇప్పటి వరకు ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలకే పరిమితం అయిన మావోయిస్టు పార్టీ ఉనికి ఏకంగా మండల కేంద్రానికి అతి సమీపంలో ఉనికి బయటపడడం సంచలనంగా మారింది. వాజేడు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు కాలనీకి చెందిన ఇద్దరిని పోలీస్ ఇన్ ఫార్మర్ పేరిట నక్సల్స్ హత్యం చేయడం కలకలం లేచింది. అయితే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములపై ఆరోపించేందుకు వచ్చిన దళం వేర్వేరుగా లేఖలు వదిలేయడం కొత్త ఆనవాయితిని అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. పంచాయితీ కార్యదర్శి రమేష్, అతని సోదరుడు అర్జున్ ను టార్గెట్ చేసేందుకు వచ్చిన మావోయిస్టు పార్టీ నక్సల్స్ వేర్వేరుగా లేఖలు వదలి వెల్లడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కడం లేదు. గతంలో టార్గెట్లను హతం చేసిన తరువాత ఆ ఘటనలో ఎంతమందిని చంపితే వారి వివరాలను వెల్లడిస్తూ ఒకే లేఖలో వెల్లడించేవారు. కానీ వాజేడు మండల కేంద్రంలో మాత్రం మావోయిస్టులు అన్నదమ్ములను హతం చేసి వేర్వేరుగా లేఖలు వదిలేయడం గమనార్హం.