చత్తీస్ గడ్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఫైర్…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టులతో తాము శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామంటూనే ప్రభుత్వం మాత్రం అణిచివేత ధోరణితోనే ముందుకు సాగుతున్నదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణం లేకుండా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం విజయ్ శర్మ నిరంతరం చర్చల గురించి ప్రకటనలు చేస్తున్నారు కానీ గతంలోనే డికే స్పెషల్ జోనల్ కమిటీ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు మాత్రం స్పందించడం లేదంటూ ఆరోపించారు. చత్తీస్ గడ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలు తప్పుదోవపట్టించే పన్నాగం కాక మరేంటని వికల్ప్ ప్రశ్నించారు. దోపిడీకి గురవుతున్న ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం శాశ్వతంగా శాంతిని నెలకొల్పేందుకు తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ గతంలోనే ప్రకటించదన్నారు. భూ సంస్కరణలు అమలు చేయడం, భూమిలేని పేదలకు భూమి కెటాయిండచం, రైతు రుణ మాఫి, పంటలకు కనీస మద్దతు ధరలు, వ్యవసాయ సబ్సిడీల పెంపు, ఉచిత నీటిపారుదల, విద్యుత్ సౌకర్యాలను మెరుగు పర్చడం వంటి డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు దండకారణ్యంలో మోహరించిన బలగాలు క్యాంపులకే పరిమితం కావల్సి ఉంటుందని వికల్స్ స్ఫష్టం చేశారు. ఆరు నెలల పాటు బలగాలు, పోలీసులు క్యాంపులకు, స్టేషన్లకే పరిమితం కావాలన్న షరతు విధించారు. కొత్తగా బేస్ క్యాంపలను ఏర్పాటు చేయడం కూడా నిలిపివేయాలన్నారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించడానికి మావోయిస్టులు వ్యతిరేకమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వికల్ప్ ఆరోపించారు.
గతంలోనే…
దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్దంగా ఉందని గత ఫిబ్రవరి 15నే వికల్ప్ ప్రకటన విడుదల చేశారు. తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకున్నట్టయితే తాము చర్చలకు వస్తామని ప్రకటించారు. తాము విధించిన కండిషన్లకు అనుగుణంగా ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చినట్టయితే నేరుగా చర్చలకు హాజరవుతామా లేక వర్చువల్ విధానంతో అవుతామా అన్న విషయంపై కూడా స్పష్టత ఇస్తామని వికల్ప్ వెల్లడించారు. తాజాగా మరో సారి ప్రకటన విడుదల చేసిన ఆయన తాము చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుండి స్పందన వచ్చేందుకు అన్ని వర్గాల వారు ఒత్తిడి తీసుకరావాలని పిలుపునిచ్చారు.