మావోయిస్టుల ప్రకటనతో కలవరం…
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కూనారంలోని పొరంబోకు భూమి విషయంలో మావోయిస్టులు జోక్యం చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఇంతకాలం స్తబ్దంగా ఉన్న మావోయిస్టులు భూముల అంశంతో మళ్లీ ఏంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని 600 ఎకరాల ప్రభుత్వ భూమిని భూస్వాములు స్వాధీనం చేసుకున్నారని ఆ భూములు తిరిగి పేదలకే ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వాలని జెఎండబ్లుపి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మొత్తం 1200 ఎకరాల్లో 600 ఎకరాల భూమిలో నిరుపేదలు సాగు చేసుకుంటున్నారని మిగతా భూమిలో భూస్వాములకు అమ్మారని, 200 మంది నిరుపేదలకు ఈ భూమిని కెటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసినా ప్రతిపక్ష పార్టీ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ముఖం చాటేశారని వెంకటేష్ ఆరోపించారు. ఇప్పుడు వారంతా భూస్వాముల పక్షాన ఉన్నారని, భూస్వాములు, పెత్తందారులు ఆ భూమిని వదిలేయాలని లేనట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ భూముల కోసం ప్రజా సంఘాల నేతృత్వంలో పోరాటాలు చేసినప్పుడు కేసులు పెట్టారని ఆ కేసులన్ని కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అదే మండలంలో నాడు…
దాదాపు 14 ఏళ్ల క్రితం కూడా మావోయిస్టు పార్టీ నిరుపేదల భూముల విషయంలో జోక్యం చేసుకుంది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు, కరపత్రాలు వేసి హెచ్చరికలు జారీ చేసింది. భూ స్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎర్ర జెండాలు పాతిన భూములు తిరిగి పెత్తందారులు విక్రయిస్తున్నారన్న విషయాన్ని ఎత్తి చూపుతూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపురం గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి అనే వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. తాము ఎర్ర జెండాలు పాతి నిరుపేదలకు పంచిన భూములను భూ స్వాముల ద్వారా విక్రయించే పనిలో కొంతమంది నిమగ్నం అయ్యారంటూ మావోయిస్టులు అప్పుడు ప్రకటనలు చేశారు. సమ్మిరెడ్డి ఘటన తరువాత అంత సీరియస్ గా మావోయిస్టులు ఎంట్రీ ఇవ్వలేదు. కానీ తాజాగా కూనారం ప్రభుత్వ భూమి విషయంలో మావోయిస్టు నేత వెంకటేష్ ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది. అసలే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆరోపణలు చేయడంతో పాటు, భూములు కొనుగోలు చేసిన వారి పేర్లను కూడా మీడియాకు విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ భూ లావాదేవీల్లో దళారులుగా వ్యవహరిస్తున్నారంటూ మరికొంతమంది పేర్లను కూడా ఊటంకించడం సంచలనంగా మారింది.
ఉనికి లేని చోట…
మావోయిస్టుల అగ్ర నాయకులు కూడా రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం లేదు. సరిహద్దుల్లోనే మావోయిస్టులను కట్టడి చేస్తుండగా వారి కార్యకలపాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. మీడియాలో ప్రకటనలు విడుదల చేయడానికే పరిమితం అయిన మావోయిస్టులు కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం భూములు ఎవరి చేతుల్లో ఎంతమేర ఉన్నాయాన్న వివరాలను కూడా పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ విషయంలో మావోయిస్టులు క్షేత్ర స్థాయిలో సంచరించి వివరాలు సేకరించారా లేక బాధితులు మావోయిస్టు నేతలను కలిశారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా పెద్దపల్లి జిల్లాలోని భూముల అంశాన్ని మరోసారి లేవనెత్తడం గమనార్హం.