దండకారణ్యంలో బంకర్ల నిర్మాణం… డ్రోన్ల నుండి తప్పించకునే వ్యూహం

టేకులగూడెం ఘటనలో పాల్గొన్న వారేనన్న అనుమానం

టన్నెల్ లో తల దాచుకున్న మావోయిస్టులు

దిశ దశ, దండకారణ్యం

చత్తీస్ గడ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. డ్రోన్ల ద్వారా బలగాలు మావోయిస్టుల కదలికలపై నిఘా వేశారని గుర్తించిన నకల్స్ అటవీ ప్రాంతంలో బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా గుర్తించాయి బలగాలు. పూర్వ బస్తర్ జిల్లాలోని కీకారణ్యాల్లో బలమైన పట్టు బిగించిన మావోయిస్టుల ఏరివేత కోసం బలగాలు పలు రకాల చర్యలకు పూనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో దండకారణ్యంలో డ్రోన్ల వినియోగం కూడా విపరీతంగా పెంచారని మావోయిస్టలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే డ్రోన్ల ద్వారా తమ ఉనికిని బలగాలు పసిగట్టకుండా ఉండేందుకు నక్సల్స్ అడవుల్లో టన్నెల్లను ఏర్పాటు చేసుకుని షెల్టర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మంగళవారం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టేకులగూడెం బేస్ క్యాంప్ సమీపంలో మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. అనంతరం జవాన్లు కూడా ఎధురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుండి తప్పించుకున్నారు. ఈ ఘటన నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ ఆఫరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో దంతెవాడ అటవీ ప్రాంతంలో బంకర్ ను గుర్తించాయి. భూమిపై భారీ సైజులో గుంత తవ్విన మావోయిస్టులు అడ్డంగా కొన్ని కట్టెలను వేసి ఉంచారు. ఆ ప్రాంతంలో సంచరించిన వారికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్న మావోయిస్టులు 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉన్న సొరంగం తవ్వారు. టేకులగూడెం బేస్ క్యాంప్ దాడి జరిపినప్పుడు
బలగాలు ఎదురు దాడికి పూనుకున్నట్టయితే ఈ బంకర్ లో తల దాచుకునేందుకు ప్లాన్ చేసి ఉంటారని బస్తర్ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించినట్టయితే అడవుల్లో పరిగెత్తుతూ తప్పించుకునే క్రమంలో కాల్పుల్లో ప్రాణాలు కోల్పోచే అవకాశం లేకుండా ఉండడంతో పాటు, డ్రోన్లను రంగంలోకి దింపినట్టయితే తమ ఉనికి వెలుగులోకి రాకుండా ఉంటుందన్న యోచనతోనే ఇలాంటి బంకర్లను నిర్మించుకుని ఉంటారని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

డంప్ ల కో్సం నాడు…

దశాబ్దాలుగా మావోయిస్టులు భూమిలోపల డంపులను ఏర్పాటు చేసుకునేందుకు ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన డబ్బు, బంగారం, సాంకేతిక పరికరాలు, సాహిత్యం, మందుగుండు సామాగ్రిని భూముల్లో పాతిపెట్టి అవసరం ఉన్నప్పుడు తవ్వి తీసి వాటిని వినియోగించుకునే విధానం ఉండేది. అయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున వెంటనే తప్పించుకునేందుకు నక్సల్స్ బంకర్లను ఏర్పాటు చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టినట్టుగా భావిస్తున్నారు. గతంలో ఇలా భూమిలో కట్టెలను మరణాయుధాలుగా మల్చి భూమిలో పాతిపెట్టి బలగాలను కవ్వింపు చర్యలకు కూడా పాల్పడ్డారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు వీటిని ట్రేస్ చేశారు. భూమిని కొంతమేర తవ్వి లోపల కట్టెలను చెక్కి.. గోతి ఉన్న విషయం ఏర్పడకుండా పైన మట్టిని ఆకులను కప్పి ఉంచారు. అయితే భద్రాద్రి జిల్లాకు చెందిన పోలీసు అధికారులు మావోయిస్టుల స్కెచ్ ను పసిగట్టి వారి అంచనాలను పటాపంచలు చేశారు. తాజాగా దంతెవాడలో భూమిని సొరంగంలో తవ్వి షెల్టర్ జోన్లుగా మార్చుకునే విధానాన్ని మొదలు పెట్టడం గమనార్హం.
బంకర్లకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి..

You cannot copy content of this page