మావోయిస్టు పార్టీ పిలుపు
మార్చి 23ను సామ్రాజ్య వ్యతిరేక దినంగా పాటించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పిలపునిచ్చారు. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్ దేవ్ లను బ్రిటీష్ పాలకులు ఉరి తీసిన రోజని, మరణించే ముందు కూడా వారు ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్య వాదం నశించాలంటూ నినదించారన్నారు. ఈ నినాదాలు నేటికీ కూడా భారత నలుమూలల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని అభయ్ అన్నారు. ఈ ఘటన జరిగిన 9 దశాబ్దాలు గడిచినా నేటికీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బూర్జువా శక్తుల సంకెళ్లలోనే బంధీ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని, భారత మార్కెట్ పై విదేశి పెట్టుబడిదారుల ఆదిపత్యం సహజ వనరులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ పరిచి మరీ భారతీయ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే విప్లవోద్యమ కారులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ లు మరణించిన రోజున సామ్రాజ్య వాద వ్యతిరేక దినం పాటించాలని పిలుపునిస్తున్నామనారు. ఇందుకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాలని అభయ్ ఆ ప్రకటనలో కోరారు.