రూ. 2 వేల నోటును అచ్చు గుద్దినట్టు ఉన్న ఇది కరెన్సీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. చేతికి చిక్కింది కదా వెనకా ముందు పరీక్షంచుకుండా డబ్బులే అనుకుంటే ఖచ్చితంగా మీరు పొరపడినట్టే. మరీ పరిక్షించి చూస్తే తప్ప ఇంతకీ అదేంటో గుర్తు పట్టలేనంతగా ఉంది కదు..
టెక్నాలజీ ఎఫెక్ట్…
ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నట్టుగానే సమాజంలో కూడా క్రియేటివిటి అంతే స్థాయిలో కనిపిస్తోంది. తమ ఇండ్లలో జరిగే శుభకార్యాలను జరుపుకునేప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ఏర్పాట్లు చేస్తుండడం సహజం. ఫంక్షన్ హాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దడంలో కొంతమంది, భోజనాల ఏర్పాట్లలో మరికొంత మంది తమ స్పెషాలిటీని ప్రదర్శిస్తుంటారు. గతంలో ఎక్కడా జరగని విధంగా తమ ఇంట జరిగే వేడుక అద్భుతంగా ఉండాలని పది మంది మాట్లాడుకోవాలని భావించి ఆ స్థాయిలో శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. సమాజంలో తమ స్టేటస్ సింబల్ ను ప్రదర్శించేందుకు వేడుకల వేదికలను ఆలంబనగా చేసుకుంటుంటారు. ఇందులో ఆహ్వాన పత్రికల నుండి ఫంక్షన్ ముగిసే వరకూ ప్రతి విషయంలోనూ తమ వైవిద్యతను ప్రదర్శిస్తుంటారు. సరిగ్గా ఇలాంటిదే వీరి వివాహానికి తయారు చేసిన ఆహ్వాన పత్రిక. అందరినీ షాక్ కు గురి చేస్తున్న తయారు చేసిన ఈ కరెన్సీ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది.
రిజర్వూ బ్యాంక్ ఆఫ్ లవ్
రూ. 2 వేల నోటును పొలినట్టుగా తయారు చేసిన ఈ వెడ్డింగ్ కార్డును పరీక్షిస్తే మాత్రమే అసలు విషయం గుర్తు పట్టగలం. రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట రిజర్వూ బ్యాంక్ ఆఫ్ లవ్ అని, ట్యాగ్ లైన్ గా గ్యారెంటెడ్ బై అవర్ ఫ్మామిలీ అని కూడా ముద్రించారు. ‘WE PROMISE TO MARRY EACH OTHER & BE TOGETHER TILL THE LAST BREATH OF OUR LIFE’ అంటూ దేశంలోని వివిధ భాషల్లో నోటు విలువను ముద్రించే చోట ప్రింట్ చేయించారు. రూ. 2000 అని నెంబర్ ఉండాల్సిన చోట పెళ్లి సమయాన్ని, నోటు నెంబర్ ఉండాల్సిన చోట డేట్ ను ప్రింట్ చేయించారు. ఠక్కున చూడగానే రూ. 2 వేల కరెన్సీ నోటు అనుకునే విధంగా తయారు చేసిన ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కరెన్సీ నోటు వెడ్డింగ్ కార్డును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా గమనించకపోతే ప్రమాదమే మరి అంటున్నారు పలువురు. పెద్ద నోట్లను తీసుకునేప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం గుర్తు పెట్టుకోండి. నిజంగానే ఇన్విటేషన్ కార్డుగా ఇచ్చారో లేక తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఇలా వెడ్డింగ్ కార్డు తయారు చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కరెన్సీ వెడ్డింగ్ కార్డు మాత్రం చర్చనీయాంశంగా మారింది.