జగిత్యాల రైతు వినూత్న ఆదరణ
దిశ దశ, జగిత్యాల:
వైవాహిక బంధంతో ఒక్కటయ్యే దంపతులకు మాత్రమే పెళ్లి తంతు నిర్వహిస్తుంటారు. చూపులు కలిసిన తరువాత పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించే ఆనవాయితీ మనుషులకు మాత్రమే కొనసాగుతుంటుంది. ప్రత్యేకమైన సందర్భాల్లో ఇతర జీవరాశులకు కూడా పెళ్లిల్లు చేసే సాంప్రాదాయం ఉన్నప్పటికీ వృక్షాలకు వివాహాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మానవాళి మనగడలో అత్యంత కీలక భూమిక పోషించే చెట్లను ఆదరించడమే కాకుండా వాటికి కూడా పెళ్లి చేసే విధానం కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. ఇదే పద్దతిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు మామిడి చెట్లకు పెళ్లి తంతు నిర్వహించారు. ఆక్సిజన్ అందించడమే కాకుండా ఫలాలను అందించే మామిడి చెట్లకు కూడా వివాహం జరిపించేందుకు రైతు చూపించిన ఆసక్తి పలువురిని ఆకట్టుకుంది. జిల్లాలోని బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామ రైతులు ఓగుల అనిల, అజయ్ దంపతులు తమ తోటలోని మామిడి చెట్లకు వివాహం ఘనంగా జరిపించారు. 8 ఎకరాల్లో వేసిన మామిడి తోట తొలిసారి నాలుగేళ్ల తరువాత తొలిసారి కాతకు రావడంతో మామిడి చెట్లకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థులను, బంధువులను తోటకు ఆహ్వానించి సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు రైతు దంపతులు. బీర్ పూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధు కుమారా చార్యులు వేద మంత్రోఛ్చారణల నడుమ మామిడి చెట్లకు వివాహం కొనసాగింది.