అమ్మా, నాన్నా నా కొడుకును మీరే పెంచండి… కన్నీరు పెట్టిస్తున్న ప్రసన్న లక్ష్మీ సూసైడ్…

దిశ దశ, జగిత్యాల:

అమ్మా నాన్నా… నా కొడుకును మీరే పెంచండి… మా అత్తమ్మ వాళ్లకు మాత్రం అప్పగించకండి అని అద్దంపై రాసి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న తీరు పలువురిని కలిచివేస్తోంది. పండంటి మగబిడ్డ పుట్టాడన్న సంబరం  కూడా లేకుండా వరకట్న వేధింపులకు గురి చేస్తున్న మెట్టినింటి వారి బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్న లక్ష్మీకి, జిల్లాలోని వెల్గటూరు మండలం రామునూరుకు చెందిన తిరుపతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నక్రమంలో ప్రసన్న లక్ష్మీకి బాబు పుట్టాడు. అప్పటి నుండి ఉద్యోగం మానేసిన ఆమె ఇంటికే పరిమితం అయింది.

అనుమానంతో…

అయితే ప్రసన్న లక్ష్మీ, భర్త తిరుపతిలు ఇద్దరు కూడా చామన ఛాయ రంగులో ఉండగా, వీరికి కలిగిన సంతానం మాత్రం తెల్లగా ఉండడం ఏంటన్న కారణంతో తరుచూ మెట్టినింటి వారు వేధింపులకు గురి చేశారు. అయితే ప్రసన్న లక్ష్మీ, తిరుపతిలు మొదట ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ బాబు పుట్టిన తరువాత అనుమానం ముసుగులో కట్నం కోసం వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టారు. వీరి వివాహ సమయంలో ప్రసన్నలక్ష్మీ తండ్రి రూ. 55 లక్షల కట్నం ఇస్తానని ఒప్పుకుని రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చాడని, మిగతా డబ్బు భూమి విక్రయించిన తరువాత ఇస్తానని చెప్పి ఇవ్వలేదని  ప్రసన్న లక్ష్మీని వేధింపులకు గురి చేసేవారు. కట్నం తాలుకు మిగతా డబ్బులు తీసుకురావల్సిందేనని తరుచూ ఆమెను మానసికంగా హింసించేవారు.  మెట్టినింటి వారి వేధింపులు భరిస్తూనే ప్రసన్న లక్ష్మీ కొంతకాలం కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఐదు రోజుల క్రితం బెంగుళూరు నుండి మెట్టినింటికి చేరుకున్న తరువాత కూడా కట్నం విషయంలో అత్తింటి వారు మానసికంగా వేధించారు. ప్రసన్న లక్ష్మీ తండ్రి బుధవారం రామునూరుకు వెల్లి కూతురును వెంటబెట్టుకుని జగిత్యాలకు చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తరువాత ప్రసన్న లక్ష్మీ ఇంట్లోని అద్దంపై ‘‘అమ్మా, నాన్న నాకు బ్రతకాలని లేదు… నా కొడుకు జాగ్రత్త, ప్లీజ్ వాళ్లకు మాత్రం ఇవ్వకండి’’ అని అద్దంపై రాసి ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియాకు తెలిపారు.

You cannot copy content of this page