ఆరు వందల్లో… ఆయనదే అరుదైన చిత్రీకరణ…

మారుమూల బిడ్డకు అవార్డుల పంట…

పంథంతో ముందుకు సాగుతున్న  పంతకాని రాజు...

దిశ దశ, మహదేవపూర్:

అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆయన సహజత్వానికి పెద్దపీట వేస్తారు. నేర్చుకున్న కళకు జీవం పోసేందుకు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నేటి కాలంలోనూ నేచురాలిటీకే ప్రాధాన్యం ఇస్తూ తనలోని కళాత్మకతకు పదును పెడుతున్నారు. కుటుంబ పోషణ కోసం నేర్చుకున్న ఫోటో గ్రఫి ద్వారా అరుదైన అవార్డులను అందుకుంటున్నారు. మారుమూల మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన పంతకాని రాజు పంథంతో ముందుకు సాగుతున్నారు. అవార్డులు ఆయన చిత్రీకరణ ముందు దాసోహం అంటున్నాయి. ఆధునిక సాంకేతితతో పట్టణ ప్రాంతాల్లోని ఫోటోగ్రాఫర్లు దూకుడు ప్రదర్శిస్తున్న తనకు తానుగా మెలుకువలు నేర్చుకుంటూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

అవార్డులివే…

పంతకాని రాజు ఫోటో గ్రఫి ద్వారా అందుకున్న అవార్డులు అన్నీ ఇన్ని కావు. ఓ వైపున కమర్షియల్ ఆర్డర్స్ తీసుకుంటూనే మరోవైపున తనలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు. ఆకాశ హర్మ్యాలు… అద్దాల మేడలు, ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ వంటి వాటిని ఫోటోలు తీసి అహాఓహో అనుకునే ఈ కాలంలో సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ అవార్డులు అందుకుంటున్నారు. కోదాడ ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటో కాంగ్రెస్ లో గ్రామీణ బతుకమ్మ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ఫోటో గ్రాఫర్ అవార్డుకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా” ఉట్ల “తండా గ్రామంలో లంబాడీల జీవనశైలి పై హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవల్ వర్క్ షాప్ లో ఉత్తమ ఛాయా చిత్రం పురస్కారం లభించింది. ఆరెంజ్ సిటీ నాగపూర్ లో ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కాంపిటేషన్ లో గ్రామీణ శ్రామిక జీవనం, జీవన సంస్కృతిని ప్రతిబింబించేలా తీసిన మిర్చి లేబర్ చిత్రానికి ఉత్తమ ఛాయా చిత్రం అవార్డు లభించింది. ఒరిస్సా లోని అరుకు లో తెలంగాణ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన తెగ బొండా ప్రజల సంప్రాదాయ జీవన విధానం, జీవన శైలిపై నిర్వహించిన కాంపిటీషన్ లో పంతకాని రాజు ప్రథమ స్థానంలో నిలిచారు. ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పిఎఐ) సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపిసి) సహకారంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వజ్రోత్సవాలు, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంపై నిర్వహించిన నేషనల్ లెవెల్ ఫోటో కాంటెస్ట్ లో ఫోటో ఆఫ్ ది ఇయర్ జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం 2023 సందర్భంగా విడుదల తీసిన ప్రత్యేక సంచిక కవర్ పేజీ పై ఈ చిత్రం ప్రచుణకు నోచుకుందంటే రాజు ఫోటో గ్రఫికి ఎంతటి ప్రత్యేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రంలోని అల్లేప్పే లో నేషనల్ లెవల్ వర్క్ షాప్ లో కేరళ సంప్రాదాయ నృత్యం తెయ్యం దేవత చిత్రానికి తృతీయ బహుమతికి ఎంపికయ్యారు.

తాజాగా మరోటి …

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ 2024 దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఒరిస్సా గిరిజన తెగ బొండా మహిళల లైఫ్ స్టైల్ పై తీసిన చిత్రానికి ఉత్తమ ఛాయా చిత్రం పురస్కారం లభించింది. ఆగస్టు 19న నిర్వహించనున్న అంతర్జాతీయ ఫోటోగ్రఫి డే పురస్కరించుకుని తెలంగాణ ఫోటోగ్రఫి అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోనున్నారు.దేశంలోని 125 మంది నిష్ణాతులైన ఫోటోగ్రఫీ కళాకారులు తీసిన 600 ఛాయాచిత్రాలు ఈ పోటీల్లో ప్రదర్శించగా మహదేవపూర్ వాసి పంతకాని రాజు తీసిన ఛాయాచిత్రం ఈ అవార్డు కు ఎంపిక కావడం విశేషం. తాను తీసిన చాయాచిత్రాన్ని ఎంపిక చేసిన తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ ప్రసిడెంట్ రావులపల్లి సునీత మరియు వైస్ ప్రసిడెంట్ సంపత్ కుమార్,అకాడమీ కార్యదర్శి బండి వి రమణలకు పంతకాని రాజు కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page