నిన్న బంద్… నేడు బందూకులు…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్యంలో మళ్లీ అలజడి చోటు చేసుకుంది. మావోయిస్టుల బంద్ పాటించిన మరునాడే ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దండకారణ్యంలో బలగాలు, మావోయిస్టులకు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న పోరు యథావిధిగా కొనసాగుతూనే ఉంది. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎదురు కాల్పులు జరగడం సంచలనంగా మారింది. మంగళవారం మద్యాహ్నం 1.30 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో చత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లా కరోనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటాబెటియా, బినాగుండ సమీపంలో మావోయిస్టులకు, డీఈర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లకు ఎదురు కాల్పులు జరిగాయి. ఛోటాభెటియాకు దక్షిణం వైపున 15 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భారీ ఎత్తున మావోయిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ చనిపోయినట్టుగా కంకేర్ జిల్లా పోలీసు అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే అనధికారికంగా వస్తున్న సమాచారాన్ని బట్టి మాత్రం 12మంది మావోయిస్టులు చనిపోయారని, ఘటనా స్థలంలో ఆధునిక ఆయుధాలు లభ్యం కాగా పార్టీ ముఖ్య నేతలు చనిపోయారని తెలుస్తోంది. కంకేర్ జిల్లా పోలీసు అధికారులు మాత్రం పూర్తి వివరాలు రావల్సి ఉందని కొద్దిసేపట్లో సమగ్ర సమాచారం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనలో ఓ ఇన్సె పెక్టర్ తో పాటు ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.

కీలక నేత మృతి..?

ఈ ఎన్ కౌంటర్ ఘటనలో మావోయిస్టు ముఖ్యనేత శంకర్ రావుతో పాటు లలితతో పాటు మరికొంత మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. శంకర్ రావుపై రూ. 25 లక్షల రివార్డు ఉన్నట్టుగా సమాచారం. ఘటనా స్లలం నుండి 4 ఏకె 47 తుపాకులతో పాటు ఓ ఇన్సాన్ ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన నక్సల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page