దద్దరిల్లిన దండకారణ్యం… 12 మంది నక్సల్స్, ఇద్దరు జవాన్ల మృతి…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్యం మళ్లీ దద్దరిల్లిపోయింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. బలగాలు, నక్సల్స్ తుపాకులు తూటాలు కక్కడంతో 14 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా DRG, STFతో పాటు బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. కీకారణ్యంలోకి చొచ్చుకపోతున్న క్రమంలో మావోయిస్టులు ఎధురు పడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టుగా బీజాపూర్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టగా 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యం అయినట్టుగా వివరించారు.

జవాన్ల మృతి…

ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలైనట్టుగా పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో గాయాల పాలైన ఇద్దరు జవాన్లను జగ్దల్ పూర్ కు తరలించారు. జగ్దల్ పూర్ కు MI 17 హెలిక్యాప్టర్ లో మెరుగైన వైద్యం కోసం తీసుకవెళ్లారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని బలగాలు…

భారీ ఎన్ కౌంటర్ తరువాత కూడా మరిన్ని ప్లాటూన్ల బలగాలను పోలీసు ఉన్నతాధికారుల రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుండి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బలగాలు జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. మరో వైపున మరింతమంది బలగాలు ఘటనా స్థలం నుండి కీకారణ్యంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకుని ఉంటారని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ మరింత ఉధృతం చేసినట్టుగా తెలుస్తోంది. 

You cannot copy content of this page