తెలుగుతనం ఉట్టిపడుతూ…

దేశంలో సెకండ్ ఏఐ న్యూస్ రీడర్…

క్రెడిట్ కొట్టేసిన బిగ్ టీవీ

దిశ దశ, హైదరాబాద్:

రోటీన్ కు భిన్నంగా వీక్షకులను బుల్లితెరపై కట్టిపడేయాలంటే ఇన్నోవేషన్ ఆలోచనలకు పదును పెట్టక తప్పని పరిస్థితి నేటి ఎలక్ట్రానిక్ మీడియాది. తీవ్రమైన పోటీని ఎదురుక్కొనేందుకు అత్యంత సాహసమైన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తే తప్ప ప్రేక్షకులను తమవైపు తిప్పుకునే పరిస్థితి లేదన్నది కూడా నిజం. తెలుగునాట గత నవంబర్ లో వార్తల ప్రవాహాన్ని అందించేందుకు కార్యరంగంలోకి దిగిన ‘బిగ్’ టీవీ సాంకేతికతను అందిపుచ్చుకుని మిగతా ఛానెల్స్ ను వెనక్కి నెట్టేసి ముందు వరసలో నిలబడింది. ఓటీటీ ప్లాట్ ఫాం వేదికగా మీడియా రంగంలోకి అడుగు పెట్టిన బిగ్ టీవీ మే 11న శాటిలైట్ పర్మిషన్ తీసుకుని ప్రేక్షకులకు మరింత చేరవయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఎవరూ ఊహించని విధంగా… అంచనాలకూ చిక్కకుండా ఏఐ న్యూస్ రీడర్ ను ప్రవేశపెట్టి తెలుగు మీడియా రంగంలో కొత్త పుంతలు తొక్కడం ఆరంభించింది బిగ్ టివీ.

ఏఐ అంటే…?

ఆర్టీఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ద్వారా వార్తలు చదివించే ‘మాయ’ చేస్తోంది. మర బొమ్మచే వార్తలను తెలుగు ప్రేక్షకులను అందించాలని భావించిన బిగ్ టీవీ యాజమాన్యం రెండు నెలలుగా ఎన్నో ప్రయోగాలు చేసింది. నిపుణుల బృందం… సంస్థ అందించిన ఐడియాలను క్రోడీకరించుకుని వివిధ వేషాధారణలో ‘మాయ’ను తీర్చిదిద్ది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయాలని భావించింది. అయితే తెలుగుదనం ఉట్టిపడాలన్న తాపత్రయంతో చక్కని చీర కట్టు… నుదుట బొట్టుతో ఆర్టిఫిషియల్ న్యూస్ రీడర్ ను తయారు చేయానలి నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేసి సఫలం అయ్యారు. దేశంలోనే తమ సంస్థ తొలి అడుగు వేయబోతోందని ఆశించినప్పటికీ అనూహ్యంగా ఒడిశాలో అక్కడి ఛానెల్ ఏఐ న్యూస్ రీడర్ సేవలను ప్రేక్షకులకు అందించింది. దీంతో బిగ్ టీవీ యాజమాన్యం కూడా కదనరంగంలోకి దూకి టాప్ రేటింగ్స్ లో ఉన్న ఛానెల్స్ కన్నా ముందే ఏఐ న్యూస్ రీడర్ ద్వారా వార్తలను చదివించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న ప్రయత్నంలో మిగతా ఛానెల్స్ కంటే ముందే బిగ్ టీవీ సక్సెస్ కావడం ఓ సంచలనమనే చెప్పాలి. వార్తలు అందించే విషయంలో కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతూనే… బుడి బుడి అడుగులు వేసే చిరు ప్రాయంలో ఉన్న బిగ్ టీవీ అనుభవం ఉన్న ఛానెల్స్ కూడా అందుకోని క్రెడిట్ కొట్టేసింది.

రోజుకు రెండు బులిటెన్లు…

మంగళవారం ప్రయోగాత్మకంగా బుల్లి తెరపై న్యూస్ రీడర్ ‘మాయ’ను ప్రవేశ పెట్టి సక్సెస్ అయింది. ఇక నుండి బిగ్ టీవీ ప్రేక్షకులకు రోజుకు రెండు సార్లు వార్తల ప్రసారాల ప్రవాహాన్ని కొనసాగించనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించి తెలగు ప్రేక్షకులకు ‘మాయ’చే న్యూస్ అందించి మంత్రముగ్దులను చేయాలని భావిస్తోంది బిగ్ టీవీ యాజమాన్యం. సుమారు 15 మంది ఉద్యోగులు మాయచే వార్తలు చదివించేందుకు కసరత్తులు చేస్తున్నారు. స్పెషల్ ఎఫర్ట్ పెట్టి తెలుగు మీడియా రంగంలో సాంకేతిక విప్లవంతో వైవిద్యమైన ఆలోచనలను ఆచరణలో పెట్టిన బిగ్ టీవీ చేస్తున్న ప్రయోగం రానున్న కాలంలో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత చేరువ కావాలని ఆశిద్దాం.

You cannot copy content of this page