ఢిల్లీ కోచింగ్ సెంటర్లపై కొరడా… రంగంలోకి దిగిన ఎంసీడీ…

దిశ దశ, న్యూఢిల్లీ:

సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ముగ్గురు అభ్యర్థులు మరణించిన తరువాత కానీ ఢిల్లీ అధికార యంత్రాంగంలో కదలిక రాలేదు. ఇబ్బముబ్బడిగా వెలిస్తున్న కోచింగ్ సెంటర్లపై అజమాయిషీ లేకపోవడంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మౌళిక వసతులతో పాటు శిక్షణ కోసం అనువైన వాతావరణం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వెలిసిన కోచింగ్ సెంటర్ల తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం రాత్రి వచ్చిన భారీ వరదల ప్రభావంతో సెల్లార్ లో నిర్వహిస్తున్న రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. సుమారు 12 ఫీట్ల వరకు వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులను మృత్యువు కబళించింది. ఈ ఘటన తరువాత శిక్షాణార్థులు కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పటు మూడు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు చనిపోవడం దేశ వ్యాప్తంగా కూడా ఆందోళణ వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) బృందాలు కోచింగ్ సెంటర్లపై కొరడా ఝులిపించాయి. 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేసిన ఎంసీడీ బృందాలు బల్డోజర్లను రంగంలోకి దింపాయి. అక్రమ కట్టడాలను కూడా ఈ సందర్భంగా కూల్చివేసే పనిలో నిమగ్నం అయ్యారు. రౌస్ ఐఏఎస్ స్డటీ సర్కిల్ పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఎంసీడీ అధికారులు ఘటన జరిగిన తరువాత చేపడుతున్న కఠిన చర్యలను యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేనట్టయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

పర్మిషన్ ఉందా..?

ఢీల్లీలోనే ప్రామాణికతలతో కూడిన కోచింగ్ ఇస్తారన్న ప్రచారం దేశ వ్యాప్తంగా కూడా సాగింది. దీంతో సివిల్స్ ప్రిపరేషన్ కోసం దేశం నలుమూలల నుండి కూడా అభ్యర్థులు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. అయితే తాజా ఘటనతో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో నడుస్తున్న చాలా కోచింగ్ సెంటర్లు కూడా అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోచింగ్ సెంటర్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల మేరకు ఈ సెంటర్లు ఏర్పాటు చేశారా లేదా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 

You cannot copy content of this page