దిశ దశ, కరీంనగర్:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ పై హత్యాచరం ఘటనతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగతున్నాయి. వైద్యులు 24 గంటల పాటు విధుల బహిష్కరణలో పాలొంటున్నారు. కోల్ కత్తా ఘటనకు నిరసనగా డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సర్వీసులు మినహా మిగతా సేవలన్నింటినికి దూరంగా ఉండాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆద్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కోల్ కత్తా జూనియర్ డాక్టర్ ఘటనను కరీంనగర్ డాక్టర్లు ముక్త కంఠంతో వ్యతిరేకంచారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని వందాలాది మంది డాక్టర్ నిరసనల పాల్గొన్నారు.
బోసిపోయిన దవాఖనాలు…
కేవలం అత్యవసర సేవలకే పరిమితం కావాలని పిలుపునివ్వడంతో కరీంనగర్ లోని ఆసుపత్రులు బోసిపోయాయి. వైద్యులంతా రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో దవాఖానాల్లో వైద్య సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే కేంద్రంగా పేరున్న కరీంనగర్ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.