ఎగువన అలా… దిగువన ఇలా… మేడిగడ్డ బ్యారేజ్ తీరు

దిశ దశ, భూపాలపల్లి:

అన్నారం బ్యారేజీని మరిపించే విధంగా మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి తయారైంది. అన్నారానికి బుంగలు పడినట్టుగానే ఈ బ్యారేజీకి కూడా భారీ సైజు బుంగ పడింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ భవిష్యత్తు ఏమిటన్నదే ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలను పరిశీలిస్తే ఈ బ్యారేజీ పనికి వస్తుందా రాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వర్షాలు ప్రారంభం కాకముందే గేట్లన్నింటిని ఎత్తిపెట్టినట్టయితే వరధ ఉదృతి కారణంగా బ్యారేజీ డ్యామేజీ కాకుండా ఉంటుందని ఎన్డీఏస్ఏ నిపుణులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తినప్పటికీ పిల్లర్లు కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్ లోని గేట్లను తొలగించడంలో అపశృతి చోటు చేసుకుంది. దీంతో భారీ కుదుపుతో పాటు శబ్దాలు రావడం, సెన్సార్లు కూడా అప్రమత్తం చేయడంతో ఇంజనీర్లు గేట్లు ఎత్తే పనిని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయేతే తాజాగా వెలుగులోకి వచ్చిన బుంగ కలవరపెడుతోంది.

ఎగువన చిన్నగా…

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని 20, 21 పిల్లర్ల సమీపంలో బుంగ ఏర్పడింది. ఎగువ ప్రాంతంలో రెండు పిల్లర్ల మధ్య ఏర్పడిన ఈ బుంగ గేట్లకు దిగువనకు చేరే సరికి 16వ పిల్లర్ నుండి 21వ పిల్లర్ వరకూ విస్తరించింది. దీంతో ఎగువ ప్రాంతంలో దాదాపు 120 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ బుంగ 130 మీటర్ల దిగువ ప్రాంతానికి చేరుకునే సరికి 300 ఫీట్ల వరకు విస్తరించుకుంది. అయితే ఇప్పటి వరకు ఇంజనీర్లు 22 మీటర్ల మేర ఇసుక నింపడంతో నీటి ఉధృతి తగ్గినట్టుగానే కనిపిస్తోంది. పిల్లర్ల కింద కాంక్రీట్ ప్రొటెక్షన్ వాల్, మట్టి మధ్య నుండి నీరు ఉబికి వస్తోంది. మరో వైపున పిల్లర్లకు దిగువ భాగంలో నాలా కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఊట కారణంగా నాలా ఏర్పడినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. అయితే బుంగలను పూడ్చేందుకు కాంక్రీట్ గ్రౌంటింగ్ చేయిస్తున్నప్పటికీ సుమారు 25 మీటర్ల లోపల ఏర్పడిన నాలా నుండి వస్తున్న వరధను కట్టడి చేయకపోతే ఎలా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. అన్నారం బ్యారేజీలో సీఫేజ్ ఏర్పడినప్పుడు దాదాపు నెల రోజుల పాటు కెమికల్ గ్రౌంటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇదే బ్యారేజీకి మరో చో్ట సీఫేజ్ ఏర్పడడం గమనార్హం. చిన్నగా ఏర్పడిన ఆ బుంగలను పూడ్చేందుకే అంత సమయంలో పడితే మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో ఏర్పడ్డ బుంగను పూడ్చాలంటే ఎంత సమయం పుడుతుందోనన్నది తేలాలి. అన్నారంలో కేవలం బుంగలు మాత్రమే ఉండేవి కానీ మేడిగడ్డ బ్యారేజీకి ఊటతో్ ఏర్పడిన నాలా వల్ల గ్రౌంటింగ్ చేయడం సాధ్యపడుతుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అన్నారం బ్యారేజీకి కేవలం మానేరు, గోదావరి నదుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. కానీ మేడిగడ్డలో ఈ రెండింటితో పాటు ప్రాణహిత నది నీరు చేరుతుండడం వల్ల వరధ ఉధృతి తీవ్రంగా ఉంటుందన్నది వాస్తవం. గత సంవత్సరం వచ్చిన వరదలను గమనించినట్టయితే 26 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ మీదుగా ప్రవహించింది. ప్రస్తుతం కుంగుబాటు కారణంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ మీదుగా ఈ సారి వానాకాలంలో అదే స్థాయిలో వరధ వచ్చినట్టయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయెనన్న విషయం ఆందోళన కల్గిస్తోంది.

You cannot copy content of this page