దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాల ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.ఆదివారం కరీంనగర్ కు వచ్చిన మంత్రిని యూనియన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలని, విధి విధానాల కోసం అధికారులతో వేసే కమిటీలో యూనియన్ నాయకులకు ప్రాతినిథ్యం కల్పించాలని అభ్యర్థించారు. విలీనానికి సంబంధించిన వ్యవహారాలను త్వరితగతిన చక్కదిద్ది ఆర్టీసీ ఉద్యోగులకు ట్రెజరీల ద్వారా వేతనాలు అందే విధంగా చూడాలని కోరారు. వెల్ఫైర్ కమిటీలను రద్దు చేసి కార్మిక సంఘాలను అనుమతించే విధంగా కూడా చొరవ తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీని అమలు చేయడంతో పాటు డీఏ బకాయిలను విడుదల చేయాలని కూడా కోరారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కోసం సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో స్టాఫ్ వర్కర్స్ యూనియన్ (INTUC) రాష్ట్ర వైస్ ప్రసిడెంట్ జక్కుల మల్లేశం గౌడ్, కరీంనగర్ రీజియన్ ప్రసిడెంట్ టీఅర్ రెడ్డి, కార్యదర్శి ఎన్ కే రాజు తదితరులు పాల్గొన్నారు.