మేఘనాధ్ సాహా- సుప్రసిద్ధ భారతీయ ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త
వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం…
చదువుకోవాలన్న తపన ఉన్న ఆ విద్యార్థిలో తపన ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుగోడగా మారాయి. కుటుంబాన్ని పోషించే తండ్రికి వచ్చే ఆదాయం బోటాబోటి కావడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దాతల సాయంతో చదువుకుంటున్న ఆ బాలుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసి సహద్యాయుల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప ధీశాలి. ఉన్నత చదువులు చదివి దేశ తొలితరం శాస్త్రవేత్తగా ఎదిగి ఖగోళంపైనే పరిశోధనలు జరిపిన ఆదర్శప్రాయుడాయన. తనలోని అపారమైన జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించిన ఆయన నేటి తరం పరిశోధకులకు కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు. వెలుగులోకి రాని ఆ గొప్ప శాస్త్రవేత్త వర్థంతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ కిరాణ దుకాణం వ్యాపారి కొడుకు భారత దేశ ఔన్నత్యాన్ని చాటిన తీరు నేటితరానికి తెలియకపోవచ్చు. అత్యద్భుతమైన పరిశోధనలు చేసిన మేఘనాథ్ సాహా అందించిన స్పూర్తి ఇది.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భాగమైన ఢాకాలోని సియోర్‌తలి గ్రామంలో 1893 అక్టోబరు 6న, జగన్నాథ్ సాహా, భువనేశ్వరి దేవి దంపతులకి పుట్టిన మేఘనాథ్ సాహా కేవలం విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు ఎదిగారు.
చదువంటే ప్రాణంగా భావించిన ఆయన మక్కువే ఉన్నత శిఖరాలకు చేర్చింది. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి ఆదాయం చాలినంత రాకపోవడంతో కుటుంబం తరచు పస్తులతో గడిపిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్టాలని తండ్రి ఆలోచిస్తున్న సమయంలో చదువే ప్రాణమైన వాన్ని చదివించే మంచి మనషులకు ధాతృత్వం ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. దీంతో సాహా చురుకుదనాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆయన తండ్రికి నచ్చచెప్పి డాక్టర్ అనంత కుమార్ దాస్ అనే దాత సాయంతో ఓ బోర్డింగ్ స్కూలులో చేర్పించారు. సాహా చదవులో రాణిస్తూ తనలోని ప్రతిభాపాటవాల ప్రదర్శనతో స్కాలర్‌షిప్‌లు అందుకుంటూ ఉన్నత చదవుల కోసం బంగ్లాదేశ్ లోని ఢాకా వెళ్లాడు.
ఆ నాటి బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించినందుకు నిరసనగా గవర్నర్ తమ స్కూలును సందర్శిస్తున్న కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు తన స్నేహితులను కూడా చైతన్య పరిచాడు సాహా. దీంతో ఢాకాలోని స్కూల్ నుండి అతన్ని డిస్మిస్ చేయడంతో అర్థాంతరంగా చదువు నిలిచిపోవల్సిన పరిస్థితి తయారైంది. మరో స్కూళ్లో చేరిన అక్కడ కూడా స్కాలర్‌షిప్ అందుకునేందుకు అర్హత సాధించారు.
కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో తన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరణనిచ్చిన గొప్ప ఉపాధ్యాయులైన జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్రరాయ్ ల దిశానిర్దేశంలో విజ్ఞాన శాస్త్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. సత్యేంద్రనాథ్ బోస్, పీసీ మహలా నోబిస్, సిసిర్ కుమార్ మిత్రాలు, జ్ఞాన్ ఘోష్ మరియు జ్ఞానేంద్ర నాథ్ ముఖర్జీలు కూడా ఆయన సహధ్యాయులే. వీరంతా కూడా శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశం కోసం అత్యున్నత సేవలందించడం మరో విశేషం.
ఎమ్మెస్సీ పూర్తి చేసిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వక పోవడంతో… ట్యూషన్లు చెబుతూనే పరిశోధనలను కొనసాగించారు.
తన పరిశోధనలతో ఏదో సాధించాలనే తపన ఆయన ఆసక్తికి ప్రధాన కారణమైంది.
ఆ తరువాత కాలంలో కలకత్తాలో అధ్యాపకుడిగా చేరిన ఆయన ఖగోళ, భౌతిక శాస్త్రంపై అద్భుతమైన ప్రయోగాలు చేసి సపలం అయ్యారు. సూర్యకాంతి గాజు పట్టకం ద్వారా ప్రసరించినప్పుడు వర్ణపటం (Spectrum) ఏర్పడడానికి కారణమేంటో తెలుసుకుని అయనీకరణ సూత్రాన్ని ప్రతిపాదించారు. అలాగే సూర్యుని ఉష్ణోగ్రతలు, సౌష్టవం, సంయోజనం లాంటి ధర్మాలను విశ్లేషించారు. అలహాబాదు విశ్వ విద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా వర్ణపట విజ్ఞానం (Spectroscopy), అయనావరణం (Ionosphere) పై పరిశోధనలు చేశారు. సూర్యకిరణాల బరువును, ఒత్తిడిని కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. పురాతన శిలలు, సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధనలు చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో స్థాపించిన న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి ‘సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్’ అని పేరు పెట్టి గౌరవించారంటే ఆయన పరిశోధనల ఫలితాలు ఎంతమేర సాధించారో అర్థం చేసుకోవచ్చు. పరమాణు కణాల త్వరణాన్ని పెంచే తొలి యాక్సిలరేటర్ సైక్లోట్రాన్‌ను దేశంలో మొట్టమొదటగా స్థాపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
మూలకాల యొక్క థర్మల్ అయనీకరణం గురించి అధ్యయనం చేసి “సాహా అయనీకరణ సమీకరణం” అని పిలువబడే ఒక సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణం నక్షత్రాల వర్ణపటాన్ని వివరించడానికి ఉపయోగపడే ప్రాథమిక సాధనాల్లో ఒకటి. అయనీకరణ సమీకరణం… నక్షత్రాల వర్ణపటాన్ని అధ్యయనం చేయడం ద్వారా వాటి ఉష్ణోగ్రత, పీడనం మరియు రసాయన కూర్పును నిర్ణయించడానికి, వాటి పరిణామాన్ని అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. సౌర కిరణాల బరువు మరియు పీడనాన్ని కొలవడానికి సాహా ఒక పరికరాన్ని కూడా కనుగొన్నారు. మేఘనాథ్ సాహా పరిశోధనలు ఖగోళ, భౌతిక శాస్త్ర రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. అవి నేటితరానికి కూడా దిశానిర్దేశం చేస్తున్నాయి.
ప్రయోగాల ఉపయోగాలు: సాహా అయనీకరణ సమీకరణం నక్షత్రాల వాతావరణంలో అణువుల యొక్క అయనీకరణ స్థాయిని లెక్కించేందుకు ఉపకరిస్తోంది. ఇది నక్షత్రాల ఉష్ణోగ్రత, పీడన , రసాయన కూర్పు వల్ల వాటి పరిణామాన్ని ఖచ్చితంగా నిర్ణయించేందుకు దోహదపడుతోంది. దీని వల్ల అంతరిక్ష నౌకల రూపకల్పనతో పాటు వాటిని పరిశోధించడం సాధ్య పడుతోంది. సాహా అయనీకరణ సమీకరణం నక్షత్రాల వాతావరణంలో వివిధ మూలకాల సాంద్రతలను లెక్కించడానికి, ఇది నక్షత్రాల రసాయన కూర్పును అర్థం చేసుకోవడానికి, నక్షత్రాల జీవిత చక్రాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక భూమిక పోషిస్తోంది. సూర్యుని వాతావరణంలో అయనీకరణ ప్రక్రియలను అధ్యయనం చేయడంతో పాటు సౌర గాలి ఏర్పడటంలో వాటి పాత్ర ఎంత మేర ఉందన్న విషయాలను కులంకశంగా వివరించారు. సాహా న్యూక్లియర్ ఫిజిక్స్ రంగంలో కూడా పరిశోధనలు చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధన ద్వారా భవిష్యత్తులో శక్తి ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తున్నాయి. భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ ఫిజిక్స్ సంస్థను స్థాపించడంలో సాహా భాగస్వామం ఎంతో ఉంది. మేఘనాథ్ సాహా ప్రయోగాలు ప్రధానంగా ఖగోళ, భౌతిక శాస్త్ర రంగాలకు పునాది రాయిలాంటివని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనలకు సాహా పరిశోధనలు దోహదపడుతున్నాయంటే ఆయన పరిశోథన ప్రతిఫలాలను ఎలా అందుకుంటున్నామో అర్థం చేసుకోవచ్చు.
ప్రజల్లో శాస్త్రీయ విద్యను వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో ఆయన ‘ఇండియన్ సైన్స్ న్యూస్ అసోసియేషన్’ను స్థాపిండంతో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఫిజికల్ సొసైటీ, ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) వంటి అనేక శాస్త్రీయ సంఘాల నిర్వహాణలో ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యం. 1953 నుండి 1956 వరకు ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ కు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మేఘనాద్ సాహా లండన్ రాయల్ సొసైటీకి ‘‘ఫెలో’’గా ఎంపికయ్యారు. సైన్స్ అండ్ కల్చర్ పత్రికను నడిపి సమాజానికి ఆయా రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ అందించే ప్రయత్నం కూడా చేశారు. ఆయన రాసిన ‘ఎ ట్రిటైజ్ ఆన్ హీట్’ నేటికీ భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రామాణిక పాఠ్యగ్రంథంగా పరిగణిస్తున్నారు. నక్షత్ర ఖగోళ భౌతిక శాస్త్రానికి తలుపులు తెరిచిన మేఘనాథ్ సాహా అయనీకరణ సమీకరణం 20వ శతాబ్దపు భారతీయ విజ్ఞాన శాస్త్రంలో అత్యుత్తమ పది విజయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. నోబెల్ పురస్కారం కోసం కూడా అర్హత ఉన్న ఈ పరిశోధనలు ఏ కారణంగానో అందుకోలేక పోయాయి.
భారతీయ శాస్త్రవేత్తలు సీవీ రామన్, సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాథ్ సాహాలు ఫిజిక్స్‌లో చెరగని ముద్రవేసిన త్రిమూర్తులుగా చెబుతారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో కూడ ఆయనకు సాన్నిహిత్యం ఉండేది.
బెంగాల్ మరియు జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరదల వినాశకరమైన ప్రభావంపై సాహా రాసిన రచనల కారణంగా దామోదర్ వ్యాలీ కమిటీ ఏర్పడిందంటే ఆయన సునిశితమైన దృష్టి ఏపాటిదో గమనించవచ్చు. వరద నియంత్రణ మరియు నిర్వహణకు దీర్ఘకాలిక ప్రణాళికలలో చురుకైన పాత్ర పోచించి బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన దామోదర్ లోయ ప్రణాళికకు సాహా చేసిన కృషి ఆయనలోని దూరదృష్టికి నిదర్శనం. భారతదేశం అభివృద్ధికి పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ మరియు సైన్స్, టెక్నాలజీని ఉపయోగించాలని ఆయన గాఢంగా విశ్వసించారు.
1952లో కోల్‌కతా నార్త్ వెస్ట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారత తొలి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. ఎంపీగా మేఘనాద్ సాహా పార్లమెంటులో విద్య, నదులు, ప్రాజెక్టులు, అణుశక్తి మొదలైన రంగాలను అభ్యున్నతి చేయాల్సిన అవసరం ఉందని గళం వినిపించారు .రాజకీయం అంటే విమర్శ ప్రతి విమర్శ కాదు దేశ ప్రగతిలో ప్రధాన భూమిక అని చేతల్లో నిరూపించిన గొప్ప వ్యక్తి. సమస్యలను నిశితంగా విశ్లేషించడంతో పాటు కీలకమైన అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు సహచర ఎంపీలకు ఆదర్శంగా నిలిచేది. 1956 ఫిబ్రవరి 16న మేఘనాథ్ సాహా అకాల మరణం భారతదేశం ఓ రాజనీతి, శాస్త్రవేత్తను కోల్పోయినట్టయింది. ఆయన అందించిన పరిశోధనల ఫలాలు నేటి తరానికి కూడా ఆధర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఇప్పటి పరిశోధకులు కూడా ఆయన అందించిన విజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ముందుకు సాగుతున్నారంటే ఏడు దశాబ్దాల క్రితం ఆయన అందించిన స్పూర్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సాహా అయనీకరణ సమీకరణం ఖగోళ భౌతిక శాస్త్రానికి మూలస్తంభంగా నిలిచపోవడంతో పాటు ఆయన స్థాపించిన పలు సంస్థలు నేటికీ శాస్త్రీయ నైపుణ్య కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. నవ భారతాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవుతూ పరిశోధనలు చేస్తున్న వారికి ఆయన అందించిన విజ్ఞానం మార్గదర్శిగా ఉపయోగపడుతున్నది. ఒక పల్లెటూరి బాలుడి నుండి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగి, రాజనీతిజ్ఞుడిగా సాహా అందించిన స్పూర్తి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఉంది.
వ్యాస రచన: మడక మధు, టీచర్, జడ్పీహెచ్ఎస్ మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా