సర్కారు పరమైన ఆర్టీసీ… టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ నిర్ణయం

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక నుండి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడగా, కార్పోరేషన్ గా ఉన్న ఆర్టీసీ కూడా ప్రభుత్వపరం కానుంది.

91 ఏళ్ల చరిత్ర..

భారతదేశంలోనే తొలి రవాణా కార్పోరేషన్ ప్రారంభించిన చరిత్ర హైదరాబాద్ కే దక్కింది. 1932లో నిజాం రాష్ట్ర రైల్వే, రోడ్డు రవాణా శాఖను అప్పటి నిజాం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మొదట 27 బస్సులు, 166 మంది కార్మికులతో సేవలు అందించచడం ఆరంభించింది ఈ సంస్థ. నిజాం స్టేట్ రైల్వే, రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (ఎన్ఎస్ఆర్… ఆర్టీడీ) పేరిట సేవలందించిన ఈ సంస్థను 1951 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తరువాత 2015 జూన్ 3న ఏపీఎస్ ఆర్టీసీ నుండి టీఎస్ ఆర్టీసీగా విడిపోయింది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ద్వారా ఇప్పటి వరకు సేవలందించిన ఆర్టీసీ సొంతగా 10,460 బస్సులను నడిపిస్తుండగా 2 వేల అద్దె బస్సుల ద్వారా ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేస్తోంది. 36,593 రూట్లలో బస్సులు నడుస్తుండగా 11 రీజియన్లు, 95 డిపోలు, 357 బస్సు స్టేషన్ల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం 43,373 మంది వరకు వివిధ స్థాయిలో ఉద్యోగులు ఆర్టీసీలో కొనసాగుతున్నారు. 1932లో నిజాం ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖల్లో ఒకటిగా సేవలందించిన ఆర్టీసీ 1951లో కార్పోరేషన్ గా ఆవిర్భవించగా తాజగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ ప్రభుత్వంలో ఓ విభాగంగా ఆవిర్భవించనుంది.

You cannot copy content of this page