ఎల్లమ్మ గుడి వద్ద ఏం జరుగుతోంది…? అల్గునూరు బ్రిడ్జి సాక్షిగా మిడ్ నైట్ వైన్ షాప్

దిశ దశ, కరీంనగర్:

ఎల్లమ్మ గుడి ఆవరణ అంతా ఓపెన్ బార్ గా మారిపోతోంది. రాత్రి అయిందంటే చాలు మద్యం ప్రియులు అక్కడకే చేరుకుంటున్నారు. లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు మూసేసినా కూడా అక్కడ మాత్రం మందు బాబులకు ఢోకా లేకుండా పోయింది. కరీంనగర్ అల్గూనురు మానేరు వంతెన సమీపంలో దర్జాగా కొనసాగుతున్న మద్యం అమ్మకాల తీరు మద్యం ప్రియులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి.

వాహనాలన్ని అటు వైపే…

లిక్కర్ షాప్స్ క్లోజ్ అయ్యాయంటే చాలు మందు బాబుల వాహనాలన్ని అల్గునూరు బ్రిడ్జి దిగువ ప్రాంతానికి చేరిపోతున్నాయి. బైక్స్ తో పాటు కార్లు కూడా అక్కడికే పరుగులు పెడుతున్నాయి. ఓ వైపున శ్మశానం, మరో వైపున మానేరు నది, ఇంకో వైపున ఎల్లమ్మ గుడి అంతా ఓపెన్ ప్లేస్ కావడంతో మందు బాబులు కూడా ఓపెన్ గా సిట్టింగ్ నిర్వహిస్తున్నారు. తెల్ల వారు జామున 5 గంటల వరకూ నిర్వహిస్తున్న బెల్ట్ షాపు వద్ద కేవలం మద్యమే కాకుండా స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. మంచింగ్ కోసం కూడా మద్యం ప్రియులు వేరే ప్రాంతంలో తిరిగే అవసరం లేకుండా పోయింది. ఇటీవలే ప్రారంభం అయినట్టుగా తెలుస్తున్న ఈ మద్యం అమ్మకాలకు అయితే ఎలాంటి అనుమతులు లేనట్టుగా స్పష్టం అవుతోంది. ఇంతకాలం సీక్రెట్ గా అమ్మకాలు జరిపే బెల్టు షాపు వాలాలే మిడ్ నైట్ వైన్స్ ఏర్పాటు చేయడంతో అక్కడ ఓపెన్ బార్ ను తలపిస్తోంది.

అన్ని రకాల బ్రాండ్లు…

ఇకపోతే అల్గునూరు ఎల్లమ్మ గుడి వద్ద రాత్రి వేళ్లల్లో మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చీప్ లిక్కర్ నుండి ప్రిమీయం బాండ్లు కూడా అందుబాటులో ఉంచుతుండడం గమనార్హం. ఇంతకాలం రహస్యంగా విక్రయించే బెల్టు షాపుల్లో సిగ్నేచర్ విస్కీ వరకే విక్రయాలు జరగగా ఈ ఓపెన్ బార్ లో మాత్రం టాప్ బ్రాండ్స్ కూడా అమ్ముతున్నారని తెలుస్తోంది. దీంతో లేట్ హవర్స్ లో మద్యం దొరకక ఇబ్బంది పడుతున్న వారంతా కూడా అల్గునూరు ఎల్లమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన మిడ్ నైట్ వైన్ షాపుకు చేరుకుంటున్నారు.

స్టాక్ ఓ చోట…

ఇక్కడ లిక్కర్ విక్రయాలు జరుపుతున్న వారు ఎప్పటి కప్పుడు స్టాక్ తెప్పించుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం. ఇందు కోసం నియమించుకున్న టీమ్స్ బైక్స్ పై వెల్లి లిక్కర్ తీసుకచ్చి అమ్ముతున్నారు. అంతేకాకుండా చిల్డ్ బీర్లతో చిల్ అవ్వాలనుకున్న వారి కోసం ప్రత్యేకంగా థర్మకోల్ బాక్సుల్లో ఐస్ వేసి మరి విక్రయాలు చేస్తున్నారు. విస్కి, బీర్లు అన్ని కూడా లైసెన్స్ డ్ బార్లను మరిపించే విధంగా ఇక్కడ అందుబాటులో ఉంటున్నట్టుగా సమాచారం. మద్యం ప్రియులు కూడా రాత్రి అయినా కూడా తమకు కావల్సిన బ్రాండ్స్ మద్యం దొరుకుతుందన్న ధీమాతో ఇక్కడకు చేరిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విధానంతో ఈ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో మిడ్ నైట్ వైన్ షాప్స్ తో పాటు పర్మిట్ రూమ్స్ కూడా నడుస్తున్నట్టుగా సమాచారం.

శాంతి భద్రల సమస్య…

అర్థరాత్రి కొనసాగుతున్న మిడ్ నైట్ ఓపెన్ బార్ వల్ల మందు బాబుల మధ్య గొడవలు చోటు చేసుకుని శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మద్యం సేవించిన వారి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటే పరిస్థితి చేయి దాటిపోతే బాధ్యత ఎవరు వహిస్తారన్న చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఎల్లమ్మ గుడి వద్దకు వెల్లి వచ్చే వాహనాలు అల్గునూరు సర్కిల్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, రామగుండం, సిరిసిల్లల నుండి వచ్చే భారీ వాహనాలు కూడా ఈ జంక్షన్ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం లేకపోలేదు.

వైరల్ వీడియోలు…

ఈ మిడ్ నైట్ ఓపెన్ బార్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. శ్మశానం వైపు వెల్తున్నారంటే ఎవరో చనిపోయి ఉంటారని మెయిన్ రోడ్డు మీద ఉన్న వారు భావిస్తున్నారు. కానీ ఎల్లమ్మ గుడి వద్దకు వెల్లి చూస్తే బహిరంగ  మాత్రం బహిరంగంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయన్న విషయం తెలియలేదు.

You cannot copy content of this page