హుజురాబాద్ బీఆర్ఎస్ లో ముసలం
రంగంలోకి దిగిన వినోద్ కుమార్
దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు వలస బాట పడుతున్నట్టుగా ఉంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరి తమ ప్రాధాన్యతను యథావిధిగా కొనసాగించుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. దీంతో హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త ముసలం మొదలైనట్టుగా సమాచారం.
రంగంలోకి వినోద్ కుమార్…
హుజురాబాద్ నియోజకవర్గంలోని కొంతమంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీకి బైబై చెప్పేందుకు సమాలోచనలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అభ్యర్థి ఎంపిక సరికాదని సమ్మిరెడ్డి తన రాజీనామా లేఖలోనే పేర్కొనడం గమనార్హం. ఇదే బాటలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ ముఖ్య నేతలతో రహస్యంగా మంతనాలు జరిపి జంప్ చేసేందుకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు వలస బాటపట్టినట్టే కనిపిస్తోంది. ఆ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా పార్టీ ఫిరాయించే వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రంగంలోకి దిగి పార్టీ మారాలనుకునే వారిని సముదాయించే పనిలో నిమగ్నం అయ్యారు. తమకు తగ్గిపోయిన ప్రాధాన్యంతో పాటు భవిష్యత్తులో తమకు గుర్తింపు లభించే అవకాశం లేదని పార్టీ మారాలనుకున్న నేతలు వినోద్ కుమార్ కు విరించినట్టు సమాచారం.
సీఎం మాటే అమలు కాలే…
ఉప ఎన్నికలప్పుడు పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు నాయకత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని, తాము కూడా అధిష్టానం పెద్దల మాట కాదనుకుండా గులాభి జెండా నీడలోనే కొనసాగామని కొందరు నాయకులు అంటున్నారు. అయితే ఉప ఎన్నికల తరువాత తమను గుర్తించే వారే లేకుండా పోయారని, స్థానిక నాయకత్వం సొంత క్యాడర్ ను బిల్డప్ చేసుకుని ముందుకు సాగుతోంది తప్ప సీనియర్లను పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలప్పుడు ఓ నాయకునికి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పదవి దక్కలేదంటే తమను ఎలా వివక్షకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఓ నాయకుడు పార్టీ ముఖ్య నాయకుల వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. గుర్తింపు లేని చోట ఉండడం కంటే వేరే పార్టీలోకి వెళ్లడమే బెటర్ అన్న యోచనలో ఉన్నామని ఒకరిద్దరు నాయకులు కుండబద్దలు కొట్టినట్టుగా సమాచారం. అయితే ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఫిరాయించేందుకు కొంతమంది నాయకులు నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం.