కరీంనగర్ అభ్యర్థిగా మంత్రి… పెద్దపల్లి ఇంఛార్జిగా ఛైర్మన్…

అధినేత వ్యూహాత్మక నిర్ణయం

దిశ దశ, కరీంనగర్:

ఒకే శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకులు వారిద్దరు. వారిద్దరు ఒకే నగరానికి చెందిన వారూ కూడా. అయినా అధిష్టానం మాత్రం ఈ ఇద్దరు నేతల విషయంలో వైవిద్యమైన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థి గెలుపునకు మరింత దొహదపడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అధినేత సీఎం కేసీఆర్ తీసుకున్న డెసిషన్ చర్చనీయాంశంగా మారింది.

మంత్రి ఓ చోట…

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గంగుల కమలాకర్ ను కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గంలో కలియ తిరుగుతున్న గంగుల మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో ఆయన నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గంగుల కమలాకర్ గెలుపును నల్లేరుపై నడకలా చేసేందుకు కరీంనగర్ కు చెందిన నాయకులందరికి బాధ్యతలు అప్పగించకుండా అధినేత తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో అయితే బలమైన నాయకులు ఉన్నట్టయితే అదే సెగ్మెంట్ లో బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం చొరవ చూపింది. టికెట్ ఆశించి భంగపడ్డ వారిని, టికెట్ మార్చిన తరువాత సిట్టింగులను ఒప్పించడంలో పార్టీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే కరీంనగర్ విషయంలో మాత్రం అలాంటి చొరవ తీసుకోకుండా వినూత్న చర్యకు పాల్పడడం గమనార్హం. సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ గా పనిచేస్తున్న సర్దార్ రవిందర్ సింగ్ ను మాత్రం కరీంనగర్ తో సంబంధం లేకుండా బాధ్యతలు అప్పగించడం విశేషం. ఆయనకు పెద్దపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధి దాసరి మనోహర్ రెడ్డిని వెల్లి కలిశారు. ఎన్నికలు ముగిసే వరకూ కూడా సర్దార్ రవిందర్ సింగ్ పెద్దపల్లికే పరిమితం కావల్సి ఉంటుంది. కరీంనగర్ సిటీకి చెందిన రవిందర్ సింగ్ కు సమీపంలోని పెద్దపల్లి నియోజకవర్గ ప్రచార బాధ్యతలు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కారణం అదేనా..?

అయితే మంత్రి గంగుల కమలాకర్, ఛైర్మన్ రవిందర్ సింగ్ ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. కరీంనగర్ టికెట్ రేసులో రవిందర్ సింగ్ కూడా ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రవిందర్ సింగ్ మళ్లీ సొంతగూటికి చేరడం, ఆ తరువాత సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం జరిగిపోయాయి. ఒకే శాఖకు చెందిన రెండు పదవులు వైరుధ్యం ఉన్న నాయకులకే అప్పగించడం కూడా అటు పార్టీలో ఇటు ప్రజల్లో చర్చ జరిగింది. అయితే అడపాదడపా మంత్రి గంగుల, ఛైర్మన్ రవిందర్ సింగ్ లు కలిసి సమావేశాల్లో కనిపించడంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని భావించారంతా. కానీ తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం సర్దార్జీకి పెద్దపల్లి బాధ్యతలు అప్పగించడం వెనక వీరిద్దరి మధ్య ఉన్న విబేధాలే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నప్పటికీ, మంత్రి గంగులకే ఓటేయాలని సర్దార్జీ పిలుపునిస్తారో లేదో వేచి చూడాలి మరి.

You cannot copy content of this page