ఊర చెరువు పండగలో అపశృతి…
దిశ దశ, కరీంనగర్:
ఊర చెరువు పండగలో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ఊర చెరువు వద్ద వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పదేళ్ల పండుగ సందర్బంగా 20 రోజుల పాటు ఘనంగా వేడుకలు చేపట్టి గ్రామాల్లో నూతనోత్సాహం నింపాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా 20 రోజుల పాటు ఏమేం చేయాలో షెడ్యూల్ తయారు చేసి పార్టీ శ్రేణులకు అప్పగించారు. ఇందులో భాగంగా గురువారం ఊర చెరువు పండగలు నిర్వహించాల్సి ఉండగా కరీంనగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ బావుపేట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఊర చెరువు పండగకు అటెండ్ అయి ఆ తరువాత స్థానిక కార్యకర్తల మేరకు నాటు పడవలో బోటింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో నాటు పడవ నీటిలో ఓవైపునకు వంగిపోవడంతో మంత్రి గంగుల కూడా నీటిలో పడిపోతున్న క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు మంత్రిని సేఫ్ గార్డ్ చేశారు.
నాటు స్పీడ్ బోట్…
మంత్రి గంగుల కమలాకర్ కు బోట్లు సహకరించనట్టుగా ఉంది. గతంలో ఓ సారి స్థానిక లోయర్ మానేరు డ్యాంలో స్పీడ్ బోట్లను ప్రారంభిస్తున్న క్రమంలో వాటిలో ఓ రౌండ్ వేసే క్రమంలో జారి నీటిలో పడిపోయారు. దీంతో కార్యకర్తలు, పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు. తిరిగి గురువారం బావుపేట గ్రామంలోని ఊర చెరువు నీటిలో నాటు పడవలో ప్రయాణించే ప్రయత్నం చేసి జారి పడిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు మంత్రిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ చెరువులో నీరు అంతగా లేకున్నప్పటికీ బురద నీటిలో కూరుకపోతే నష్ఠం చవి చూడాల్సి వచ్చేదని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి గంగుల కమలాకర్ సేఫ్ కావడం మాత్రం పార్టీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది.