చెన్నమనేని వర్గానికి షాక్…

అపాయింట్ మెంట్ ఇవ్వని మంత్రి కేటీఆర్

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సన్నిధిలోని నాయకులకు రామన్న కలిసే ఛాన్స్ ఇవ్వలేదు. తమ నేత గురించి చెప్పుకునే ప్రయత్నం చేసిన వారికి నిరాశే ఎదురయింది. నేడో రేపో జాబితా ప్రకటన విడుదల చేయనున్న నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా తారు మారు కావడంతో వేములవాడ బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కల్గిస్తోంది. ఆరు నెలల క్రితం వరకు ధీమాగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వర్గంలో క్రమక్రమంగా ఆశలు సన్నగిల్లడం ఆరంభం అయింది. తాజాగా నెలకొన్న పరిణామాలు టికెట్ వస్తుందో రాదోనన్న ఆందోళన చెన్నమనేని వర్గీయులను వెంటాడుతోంది. దీనికి తోడు మీడియాలో వస్తున్న కథనాల్లో చెన్నమనేనికి టికెట్ రాదని తేల్చి చెప్తుండడంతో రమేష్ బాబు వర్గీయులు అధిష్టానం చెంతకు వెల్లే పనిలో పడ్డారు. తాజాగా శుక్రవారం సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు వేములవాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నించారు. ఆయన కారెక్కుతున్న క్రమంలో అక్కడే వెయిట్ చేసినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వేములవాడ నాయకులు సార్ సార్ అంటూ పిలిచినా కూడా కేటీఆర్ స్పందించలేదు. దీంతో అసలేం జరుగుతోందో అర్థం కాక వేములవాడ బీఆర్ఎస్ నాయకులు అయోమయానికి గురయ్యారు. కనీసం తమతో మాట కూడా మాట్లాడకుండా కేటీఆర్ వెల్లిపోయారన్న ఆవేదన వారిలో వ్యక్తం అయింది. మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

You cannot copy content of this page