అసమ్మతికి చెక్…

రంగంలోకి దిగిన కేటీఆర్

దిశ దశ, కరీంనగర్:

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఖరారు చేసిన తరువాత నెలకొన్న అసమ్మతికి చెక్ పెట్టే పనిలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిమగ్నం అయింది. ఇందులో భాగంగా అసమ్మతిని ప్రదర్శిస్తున్న వారితో ప్రత్యేకంగా భేటీ అవుతూ వారిని మచ్చిక చేసుకునే పనిలో పడింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ప్రకటనకు ముందే నియోజకవర్గంలోని నాయకులంతా కూడా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దాదాపు అన్ని సిట్టింగ్ స్థానాల్లోని అభ్యర్థులను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో చొప్పదండి నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి చల్లారలేదు. దీంతో శుక్రవారం అసమ్మతి నేతలను హైదరాబాద్ కు పిలిపించిన నేతలు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యేలా చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా అసమ్మతి నాయకులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు తమకు మధ్య నెలకొన్న విబేధాల గురించి కేటీఆర్ కు వివరించినట్టుగా సమాచారం. అయితే సీఎం కేసీఆర్ అభ్యర్థిత్వం ఖరారు చేసినందున గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కేటీఆర్ చొప్పదండి నాయకులకు సూచించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా వీరిని కలిపించాలని ప్రయత్నించినప్పటికీ బిజీ షెడ్యూల్ లో ఉండడంతో సాధ్యం కానట్టు సమాచారం.

You cannot copy content of this page