దిశ దశ, హుస్నాబాద్:
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన నక్సల్స్ స్మారక స్థూపం అది… ఆసియాలోనే అతిపెద్ద స్థూపంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఎన్ కౌంటర్లతో పాటు ఇతరాత్ర కారణాలతో మరణించిన వారి స్మారకార్థం అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు నిర్మించింది. అయితే ఆ స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేయడంతో శిథిలాలతో పాటు అప్పుడు తయారు చేయించిన సుత్తి, కొడవలి అక్కడే మిగిలి ఉన్నాయి. ఇటీవల ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసుకుని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని మావోయిస్టు పార్టీ కూడా ఆరోపించింది. ఆ భూమిని యజమాని అమరవీరుల కోసం ఇచ్చారని కూడా స్పష్టం చేసింది. విప్లవ చరిత్రలో అత్యంత అరుదైన చరిత్రను రాసుకున్న ఆ ప్రాంతంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అధికారిక హోదాలో నివాళులు అర్పించారు. ప్రజా యుద్ద నౌక గద్దర్, సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ ప్రథమ వర్థంతి, ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర మంత్రి అక్కడ జోహార్లు అర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం సంచలనంగా మారింది. ‘‘అమరవీరుల వర్థంతి, జయంతి’’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రామానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటర్ రెడ్డి, కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, ప్రజా కవులు, గాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… 34 ఏళ్ల క్రితం నిర్మించిన హుస్నాబాద్ స్థూపం కోసం గద్దర్ కీలక భూమిక పోషించారని, ఆ ప్రదేశంలోనే ఆయన వర్థంతిని నిర్వహిస్తున్నామన్నారు. ఆ నాడు గన్ పట్టి పోరాటాలు చేసిన పరిస్థితి ఉండేదని, ఈ రోజు ప్రజా స్వామికంగా ఓటే ఆయుధంగా భారత రాజ్యాంగానమ్ని రక్షించుకోవడానికి పోరాటం జరుగుతోందని పొన్నం వ్యాఖ్యానించారు. ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగితే… మలి దశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామన్నారు. అయితే స్వరాష్ట్రం సిద్దించిన తరువాత ఆకాంక్షించినంతగా కలలను సాకారం చేసుకోలేకపోయామని, 10 ఏళ్లలో మన గొంతును మనమే వినింపించుకోలేనంత నియంతృత్వ పాలన కొనసాగిందన్నారు. దీంతో మార్పు కోరుకున్న తెలంగాణ బిడ్డలు ప్రజా పాలన తెచ్చుకున్నారన్నారు. ఆనాడు గద్దర్ పాట ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేందుకు, రక్షించుకునేందుకు కొనసాగిందని… నేటు మాత్రం పెన్ను గన్నుగా, ఓటు ఆయుధంగా మారితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. నేడు ఎవరి అభిప్రాయాలే అయినా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉందని, ప్రజా భవనాన్ని జ్యోతి బా పూలే పేరిట మార్చి, మంత్రులుల, కార్యాలయాలకు నేరుగా ప్రజలు వెల్లి వినతి చేసుకునే వేదికలుగా మారాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.