దిశ దశ, జాతీయం:
రాష్ట్ర మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి తనయుడు హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4న విచారణకు రావాలని 3వ తేదిన నోటీసులు పంపించగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను హాజరు కాలేనని హర్షరెడ్డి రిప్లై ఇచ్చిన హర్ష రెడ్డి ఈ నెల 27 తరువాత అయితే హాజరు అవుతానని బదిలిచ్చారు. ఇందుకు కస్టమ్స్ అధికారులు సమ్మతించినట్టుగగా తెలుస్తోంది. లోకసభ ఎన్నికల వేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
కోట్ల విలువైన వాచీలు…
రూ. కోట్ల విలువైన వాచీలకు సంబంధించిన అంశంలో హర్ష రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హాంగాంక్ లో స్థిరపడిన మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ సింగపూర్ నుండి చెన్నైకి వచ్చినప్పుడు అతని నుండి రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాటెక్ పిలిప్ 5740, బ్రెగ్యూట్ 2759 అనే మోడల్స్ కు చెందిన రెండు లగ్జరీ వాచీలను పిభ్రవరి 5న సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ కేసు బుక్ చేశారు. రూ. 1.73 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేసిన ఈ వాచీల్లో పాటెక్ పిలిప్ కంపెనీకి ఇండియాలో డీలర్లు లేరని, బ్రెగ్యూట్ కంపెనీకి చెందిన వాచీలు భారతదేశంలో స్టాక్ లేవని కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అలోకం నవీన్ అనే వ్యక్తి ద్వారా ముబీన్ నుండి వాచీలను కొనుగోలు చేసింది హర్ష రెడ్డిగా గుర్తించారు. USDT-ఒక రకమైన క్రిప్టోకరెన్సీ, నగదు ద్వారా హవాల మార్గంలో లావాదేవీల చెల్లింపులను సులభతరం చేసినట్టుగా కస్టమ్స్ అధికార వర్గాలు చెప్తున్నాయి. సంబందిత వ్యక్తలను విచారించిన కస్టమ్స్ అధికారులు వాంగ్మూలం కూడా నమోదు చేసుకున్నామని ప్రకటించారు. ఈ కేసు విచారణలో భాగంగానే హర్ష రెడ్డికి సమన్స్ ఇచ్చినట్టుగా కస్టమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఏప్రిలో 27 తరువాత విచారణకు హాజరు అవుతానని హర్ష రెడ్డి కస్టమ్స్ అధికారులకు సమచారం ఇవ్వడంతో ఇందుకు వారు సమ్మతించారు. అయితే ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని హర్ష రెడ్డి చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తనకు కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటోనన్నదే అంతుచిక్కడం లేదని హర్ష రెడ్డి చెప్తున్నారు. ఏధి ఏమైనా రాష్ట్ర మంత్రి పొంగులేటి తనయుడికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.