బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారు… మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ ప్రజలు తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుణ పాఠం చెప్పారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం అయిందన్నారు. ఆదివారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలు రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడికైనా బస్సులో తిరిగే సౌకర్యం కల్పించామని ఇది మహిళా సాధికారతలో భాగమేనని అన్నారు. ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని తెలంగాణ ఫ్రజల ఆకాంక్షలను సాధించే దిశగా ముందుకు సాగుతామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించేందుకు రూ. 10లక్షలు పెంచామని శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఏనాడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడ్తామని మేనిఫేస్టోలో కూడా ఈ విషయాన్ని వెల్లడించామని, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణ లోపాలపై దర్యాప్తు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారన్నారు. మాటలు తప్ప చేతలు బీజేపీలో ఉండవని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తొమ్మిదేళ్ల పాటు రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు విమర్శలు చేసుకుంటున్నారని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీల నాయకుల మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదన్నారు.

You cannot copy content of this page