ఓడిపోయినా నియంతృత్వ ధోరణి తగ్గలేదు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫైర్

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ వైఖరిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నాయకుల తీరును తప్పు పట్టారు. నియంతృత్వ ధోరణి కారణంగానే ఓడిపోయినా బీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలగడం లేదన్నారు. ఓడిపోయిన తరువాత ప్రజల నాడిని పసిగట్టి వారి ఆలోచనలను అర్థం చేసుకుంటారని ఆశించినప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని శ్రీధర్ బాబు అన్నారు. దాదాపు 3500 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలించగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 35 రోజులు మాత్రమే అవుతున్నదన్నారు. అంతకాలం అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఓర్పు, సహనాన్ని ప్రదర్శించకుండా కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారని దుయ్యబట్టారు. తమ పార్టీ ఇచ్చిన హామీలు ఒకటి తరువాత ఒకటి పరిష్కరించేందుకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. నిర్మాణాత్మకమైన సలహాలు సూచలు ఇవ్వాలని తాము పిలుపునిచ్చినా విమర్శలకే పెద్దపీట వేస్తున్నారంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజలకు ఏ సమయంలో ఏ పనులు చేయాలోనన్న విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పకడ్భందీ ప్రణాళిక ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మీరు కూడా మంచి సలహాలు అందిస్తే ప్రజలకు అన్ని విధాలుగా లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. టీఆర్ఎస్ భవన్ లో ఉంటూ ఇచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెల్లి వారిలో వ్యక్తం అవుతున్న ఆనందాన్ని గుర్తించాలని సూచించారు.

You cannot copy content of this page