జగదీశ్వర్ రెడ్డిని నిలదీసిన రెడ్డి సంఘం లీడర్స్
రాజీనామాకు డిమాండ్
దిశ దశ, హైదరాబాద్:
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. రెడ్డి సంఘం ప్రతినిదులు పెద్ద ఎత్తున మినిస్టర్స్ క్వార్టర్స్ కు చేరుకుని నిరసనలు చేస్తున్నారు. రెడ్డి కార్పోరేషన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్వార్టర్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వ్యూహాత్మకంగా మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెడ్డి సంఘం ప్రతినిధులు మంత్రి జగదీశ్వర్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ పట్టబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు విషయంలో దాటవేత ధోరణి అవలంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకున్నంత పని అయింది. ఆ తరువాత మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రెడ్డి సంఘం ప్రతినిధులు కార్పోరేషన్ పై స్పష్టత వచ్చే వరకూ నిరసన కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న రెడ్డి మంత్రులంతా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ మెయిన్ గేట్ ముందు రెడ్డి సంఘం ప్రతినిధులు బైఠాయించి వీఐపీలను దిగ్భందించారు. లోపల ఉన్న వారు ఎవరూ బయటకు రాకుండా నిలువరించేందుకు మెయిన్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. రెడ్డి సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ ఏరియా అంతా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బలగాలను మోహరించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.