ఢీల్లీకి వెల్లిన మంత్రులు…
దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక అంశం చివరకు అధిష్టానం వద్దకు చేరినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరిక గురించి అధిష్టానం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబులు ఢిల్లీకి పయనం అయ్యారు. వీరు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం ఎవరికి ఇవ్వాలి అన్న విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్య నేతల దృష్టిలో ఉన్న ఎమ్మెల్సీ జవన్ రెడ్డి అంశం గురించి కూడా అదిష్టానం ఆరా తీయనున్నట్టుగా తెలుస్తోంది.
జీవన్ రెడ్డి వాదనలు ఇలా…
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయంపై ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పలు అంశాలను ఊటంకించినట్టుగా తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్ లోని తాటిపర్తి జీవన్ రెడ్డి ఇంటికి వెల్లిన డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో చర్చించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాదన్న వాదనలు వినిపించినట్టుగా సమాచారం. తెలంగాణ ఇంఛార్జీ దీప్ దాష్ మున్షి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ లు కూడా ఫోన్లో మాట్లాడినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం శాంతించనట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డితో ఒకటి రెండు సార్లు ఫోన్లో సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి అధిష్టానం ముఖ్య నేతల ముందు ఉంచిన విషయాలకు క్లారిటీ ఇవ్వాలని కూడా అంటున్నట్టుగా సమాచారం. 1985లో టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను ఏనాడైనా పార్టీకి విధేయుడిగానే ఉన్నాను తప్ప ఏనాడూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేశానని, ప్రతికూల వాతావరణంలో తాను అధిష్టానం చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నట్టుగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా తాను పార్టీలో కొనసాగానే తప్ప ఇతర పార్టీల వైపు చూడలేదని, అంతేకాకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రి పదవి ఇస్తా పార్టీ మారాలని ప్రతిపాదన చేసినా తాను ససేమిరా అన్నానని, ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ప్రపోజల్ వచ్చినా తాను తిరస్కరించానే తప్ప పార్టీ మారలేదన్న విషయాన్ని గమనించాలని జీవన్ రెడ్డి అన్నట్టుగా సమాచారం.
డిమాండ్ ఇదే…
పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా కట్టుబడి ఉన్న తనను సంప్రదించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడానికి కారణం ఏంటో వివరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. సంఖ్యాబలం కూడా ఉన్నప్పుడు ఇతర పార్టీల వారిని ఫిరాయించే సంస్కృతి సరి కాదని, పాంచ్ న్యాయ్ లో ఒకటిగా ఉన్న ఫిరాయింపు వ్యవహారాన్ని ఎలా అతి క్రమించారో చెప్పాలని అంటున్నట్టుగా సమాచారం. గంటలకొద్ది చర్చలు జరిపినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పడంతో తమకు ఐదు రోజుల పాటు సమయం ఇవ్వాలని భట్టి విక్రమార్క అడగగా రెండు రోజులు మాత్రమే ఆగుతానని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదని సమాచారం. బుధవారం కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే గుత్తా మాత్రం అందుబాటులో లేనని చెప్తుండడంతో మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ ఇవ్వాలని కూడా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మండలి సెక్రటరీ రాజీనామా లేఖ తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం.
శ్రేణులతో సమాలోచనలు…
మరో వైపున జీవన్ రెడ్డి తన అనుచరులు, అభిమానులతో మంగళవారం సాయంత్రం నుండి ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ ఎలా అమలు చేయాలి అన్న విషయంపై పది మంది చొప్పున బృందాలుగా చేసి వారితో చర్చలు జరిపినట్టు సమాచారం. జగిత్యాలకు చెందిన పార్టీ శ్రేణులు, జీవన్ రెడ్డి అభిమానులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం పార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేల అంశం గురించి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తరువాత ఏఐసీసీ నుండి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీ ముఖ్య నేతలు ఇచ్చే సమాధానంతో జీవన్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచన చేస్తారా లేక… రాజీనామా చేస్తారా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. మండలి ఛైర్మన్ అపాయింట్ మెంట్ కోసం ఇంకా ట్రై చేస్తున్నందున ఏఐసీసీ నేతలు జీవన్ రెడ్డి అంశాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని చర్చించనున్నట్టుగా కూడా భావిస్తున్నారు.