మంత్రి గంగుల కమలాకర్ కు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకుడు

దిశ దశ, కరీంనగర్:

మంత్రి గంగుల కమలాకర్ కు వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు, ముస్లిం జేఏసీ నేత మోసిన్ అహ్మద్ ఖాన్ సవాల్ విసిరారు. మీ స్వాధీనంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది కాదని నిరూపిస్తావా అని అడిగారు. మంగళవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 15 ఏళ్లుగా ముస్లింలను అణిచివేసిన గంగుల కమలాకర్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష్య పదవితో పాటు, డిప్యూటీ మేయర్ పదవిని కూడా మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టారని ఆరోపించారు. కేవలం తన సామాజిక వర్గానికి తప్ప ఇతర కులాల గురించి పట్టించుకోలేదని, అర్బన్ బ్యాంక్ అడహక్ కమిటీలోనూ వారికే ప్రాధాన్యత ఇచ్చారని మోసీన్ అహ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఖాజీపూర్ లోని 122, 126, 129, 171, 154 సర్వే నెంబర్లలోని ఈద్గా ఖతీఫ్ ఇనాం భూమిలో 34 ఎకరాలను తప్పుడు దృవీకరణ పత్రాలతో మంత్రి గంగుల కమలాకర్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఈ స్థలాన్ని గెజిట్ నుండి తొలగించి తన పేరిట మార్పిడి చేయాలని మంత్రి 2014లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. డబ్లుపి నంబర్ 29691 ద్వారా హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అయితే ఈ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదని గంగుల కమలాకర్ పేరిట అయిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని బోర్డు సీఈఓ లేఖ కూడా రాశారన్నారు. 2021లో మరోసారి కోర్టును ఆశ్రయించిన గంగుల కమలాకర్ డబ్లుపి నంబర్ 3749 ద్వారా పిటిషన్ దాఖలు చేశారని మోసీన్ అహ్మద్ ఖాన్ వివరించారు. తన పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ ను రద్దు చేయవద్దని ఆ పిటిషన్ లో హైకోర్టును మంత్రి అభ్యర్థించారని తెలిపారు. బాధ్యతయుతమైన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టేనని ఆయన స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ముందుకు వస్తే తాము నగరంలోని ఏ మసీదు వద్ద అయినా బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. రేకుర్తిలో నిరుపేద ముస్లింలకు చెందిన 35 ఇండ్లను మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు బుల్లోజర్లతో కూల్చివేశారని, పేద ముస్లింలకు నిలువ నీడ లేకుండా చేశారన్నారు. 15 ఏళ్లుగా ముస్లిం మైనార్టీలను అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి గంగుల కమలాకర్ ను అణిచివేసేందుకు కరీంనగర్ ముస్లిం మైనార్టీలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ నెల 30న గంగులకు వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొని తమ నిరసనలు తెలియజేస్తారని మోసిన్ అహ్మద్ ఖాన్ కుండబద్దలు కొట్టారు. ఈ మీడియా సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జబ్బర్ ఖాన్, సలీం, సయ్యద్ తాజోద్దీన్ ఖాద్రీ, నవాబ్ ఖాన్, మగ్దుం అలీ, సాజద్, నవాజ్, అహ్మద్ రాజా తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page