కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ నుండి పోటీ చేసేందుకు మైనార్టీలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి తమకు టికెట్ కెటాయించాలని కోరుతూ మైనార్టీ నేత సమద్ నవాబ్ గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన కరీంనగర్ వక్ఫ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సెల్ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా సేవా రంగంలో ఉన్న ఆయన 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగతున్నారు. ఇటీవల కరీంనగర్ లో వక్ఫ్ ఆస్తులపై కూడా ఆందోళనలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న సమద్ నవాబ్ అనూహ్యంగా తనకు టికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోవడం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. 1952 నుండి ఇప్పటి వరకు కరీంనగర్ నుండి మైనార్టీలకు అవకాశం దక్కనందున ఈ సారి తమకు టికెట్ కెటాయించాలని కోరుతున్నారు. 63 నుండి 65 వేల వరకు ఓటర్లు ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో తమకు టికెట్ కెటాయిస్తే తప్పకుండా గెలుస్తామని సమద్ నవాబ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను కలిసి వివరించినట్టుగా సమాచారం. రాష్ఠ్రంలో మైనార్టీలకు కెటాయించే 12 సీట్లలో ఈ సారి కరీంనగర్ కూడా ఉండేవిధంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఉన్నట్టుండి కరీంనగర్ స్థానం నుండి మైనార్టీ నాయకులు కూడా దరఖాస్తు చేసుకోవడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది.