నిజామాబాద్ అర్బన్ తో కరీంనగర్ కు లింకు…

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక తీరు…

మైనార్టీలకు ప్రాధాన్యతపై కసరత్తులు

దిశ దశ, హైదరాబాద్:

టికెట్ల కెటాయింపులో సామాజిక వర్గాల వారిగా సమీకరణాలు చేసే పనిలో భాగంగా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థుల తలరాతలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యతాంశలను పరిగణనలోకి తీసుకోవడంతో ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతోంది. దీంతో ఇప్పటివరకు టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ధీమాతో ఉన్న ఆశావాహులు కూడా నిరాశకు గురికాక తప్పేలా లేదు. రాష్ట్రంలోని ఒక్క సీటులో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో మరో రెండు సీట్లలో ఊగిసలాట మొదలైంది.

కామారెడ్డిలో రేవంత్ రాకతో…

ఇకపోతే కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై పోటీ చేయాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ నుండి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ చేయనున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమీకరణాలు మారిపోయాయి. ఇక్కడి నుండి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఎక్కడ అకమిడేట్ చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. దీంతో మైనార్టీల బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుండి షబ్బీర్ అలీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న పరిశీలనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇందులో బాగంగా నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని షబ్బీర్ అలీకి కెటాయించాలన్న ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి నుండి పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ సుముఖుంగా ఉంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. ఇక్కడ మైనార్టీల ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షబ్బీర్ అలీ పోటీ చేస్తే లాభిస్తుందని కూడా పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. అయితే సీనియర్ నేత షబ్బీర్ అలీ నిర్ణయంతోనే ఇక్కడి అభ్యర్థి ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతోంది.

ఆయన ఓకె అంటే…

షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టయితే కరీంనగర్ స్థానం బీసీలకు కెటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఆయన నో అన్నట్టయితే మాత్రం నిజామాబాద్ అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయ అభ్యర్థి పేరు ఖరారు చేయనుంది. ఈ క్రమంలో అక్కడ బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే కరీంనగర్ లో మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ స్థానంలో మైనార్టీకి అవకాశం కల్పిస్తే కరీంనగర్ లో బీసీ అభ్యర్థిని ప్రకటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాలతో పాటు ఇంకా డిక్లేర్ చేయాల్సిన స్థానాల్లోని అభ్యర్థుల సామాజిక వర్గాలను బేరీజు వేసుకునే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాల వారికి ముఖ్యంగా మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే సమతూకం పాటించినట్టు అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page