దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన్ మన్ ధన్ పాలసీ నడుస్తున్నట్టుగా ఉంది. పరిమితమైన ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయా పార్టీలు అవలంభిస్తున్న తీరు విచిత్రంగా మారింది. చరిత్రలో ఏ నాడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీరు సాగుతోందంటే ఈ సారి ఈ ఎన్నికలకు ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గాలకు మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం నుండి ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్ల ప్రాపకం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.
మిస్డ్ కాల్ బ్యాచ్…
పట్టభద్రుల ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ అభ్యర్థి సరికొత్త పంథాలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన సదరు అభ్యర్థి గ్రాడ్యూయేట్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓటరు జాబితా ఆధారంగా స్పెషల్ టీమ్స్ పర్సనల్ టచ్ లోకి వెల్లి వారిని ప్రభావితం చేసే పనిలో పడినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఓటర్లకు మిస్డ్ కాల్ చేసి వారిని వ్యక్తిగతంగా కలిస్తున్నట్టుగా సమాచారం. సొంత పార్టీ నాయకులను అంతగా పట్టించుకోని సదరు అభ్యర్థి సీక్రెట్ మానిటరింగ్ చేస్తున్న తీరు ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. పార్టీ శ్రేణులతో సంబంధం లేకుండా ఒంటెత్తు పోకడలతో పోతున్నాడన్న విషయంపై సొంత పార్టీ నాయకులు బాహాటంగానే చర్చించుకున్న నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపించగానే పర్సనల్ టీమ్స్ ను రంగంలోకి దింపడంపై కూడా పార్టీ వర్గాలు కినక వహిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని తమ నాయకుల ముందు వెళ్లగక్కలేకపోతున్న క్యాడర్ తమ బాద లీడర్లకు తెలిసేదెలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. నాలుగు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో టచ్ లో ఉంటూనే సొంత ఎజెండాను అమలు పరుస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ఫ్యామిలీ మెంబర్స్ కనుసన్నల్లోనే వ్యవహారం నెరుపుతున్న ఆ అభ్యర్థి తాజాగా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసుకున్న తీరు కూడా పార్టీ వర్గాలను మింగుడు పడకుండా చేస్తోంది.
విందులు…
ఇకపోతే ప్రొఫెషన్ల వారిగా ప్రత్యేకంగా విందులు వినోదాలు కూడా అందించే సంస్కృతి కూడా ఈ ఎన్నికల్లో మొదలైంది. ఇందు కోసం సంబంధిత ప్రొఫెషన్ లో స్థిరపడ్డ తమ పార్టీ నాయకులను పంపించి ప్రత్యేకంగా దావత్ లు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
టీచర్లతో…
ఇకపోతే ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూడా ఓ అభ్యర్థి తమ పార్టీ నాయకులతో సంబంధం లేకుండానే స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీచర్లను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారన్న ప్రచారం బాహాటంగానే సాగుతోంది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ తంతును కట్టడి చేసే వారు లేకుండా పోవడం ఏంటన్న చర్చ కూడా మొదలైంది.