దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులు అన్ని దొరకకపోవడంతో గదుల తలుపులు తెరుచుకోలేదు. హైకోర్టు ఆదేశంతో ధర్మపురి కౌంటింగ్ కు సంబంధించిన వివరాలు సేకరించాలని నిర్ణయించిన జిల్లా ఎన్నికల అధికారులకు స్ట్రాంగ్ రూం తాళం చేతులు దొరకకపోవడం షాకిచ్చినట్టయింది. సోమవారం ఉదయం జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ యాస్మిన్ భాషా సమక్షంలో ధర్మపురికి సంబంధించిన స్ట్రాంగ్ రూం తెరవాలని అధికారులు ప్రయత్నించారు. అయితే దీనికి సంబంధించిన తాళం చేతులు దొరకకపోవడం అధికారులను ఇరకాటంలో పెట్టింది. కలెక్టరేట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న తాళం చేతులతో తాళాలు తీసే ప్రయత్నించగా కేవలం ఒక గది మాత్రమే తెరుచుకుంది. మిగతా రెండు గదుల తాళం చేతులు మాత్రం టాలీ కాకపోవడంత లాక్స్ ఓపెన్ కావడం లేదని సమాచారం. దీంతో జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కూడా తాళాలు పగలగొట్టద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. హై కోర్టు అనుమతితోనే ఎలాంటి చర్యలు అయినా తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాను కూడా హై కోర్టును ఆశ్రయిస్తానని కూడా అడ్లూరి మీడియా ముందు ప్రకటించారు. మద్యాహ్నం 3.30 గంటల వరకు జిల్లా అధికారులు ఈవీఎం స్ట్రాంగ్ రూం తాళం చేతుల కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. తెరుచుకున్న గదిలో హైకోర్టు అడిగిన రికార్డులు లేవని కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. ఈ నివేదిక హైకోర్టుకు కూడా సమర్పిస్తామని వెల్లడించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post