మహారాష్ట్రలో అసెంబ్లీలో సాక్షత్కరించిన సన్నివేశం
పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైతే ఆ తల్లులు పడే మనోవేదన అంతా ఇంతా కాదు. కొన్ని సార్లు కొంతమంది తల్లులు ఇలాంటి విషమ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాటిని అధిగమించాడానికి వారు పడే తపన అంతా ఇంతా కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డను వదిలి వెల్లినా తిరిగి వారిని అక్కున చేర్చుకునే వరకూ మానసిక వేదనకు గురవుతూనే ఉంటారు. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతూ బిడ్డ చుట్టే ఆలోచనలు తిరుగుతుంటాయి. చివరకు బిడ్డ వద్దకు చేరుకోగానే ఠక్కున చేతుల్లోకి తీసుకుంటే తప్ప ఆ తల్లి మనసు కుదుట పడదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ శాససభ్యురాలికి ఎదురైంది. తల్లి స్పర్ష కోసం అల్లాడే చంటి బిడ్డను చూసుకోవడం ఎలా, తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయడం ఎలా అని సుదీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. చివరకు ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే…?
నాగ్ పూర్ అసెంబ్లీలో
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా డియోలాలి నియోజకవర్గానికి సరోజ్ అహేరీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా అసెంబ్లీ కొనసాగలేదు. చాలా కాలం తరువాత శీతాకాల సమావేశాలతో అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ చేసేందుకు మహా సర్కార్ నిర్ణయించుకుంది. సోమవారం ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్న సరోజ్ అహేరీ తన రెండున్నర నెలలున్న బిడ్డను ఎత్తుకుని మరీ అసెంబ్లీకి వచ్చారు. ఇంటి వద్దే ఉంచి సమావేశాలకు వెల్తే బిడ్డ తన కోసం ఏడిస్తే ఎలా అని ఆలోచించిన ఆమె బిడ్డను తన వెంటే తీసుకెళ్లాలని భావించారు. అటు తన నియోజకవర్గ ప్రజలు, ఇటు కడుపున పుట్టిన బిడ్డ విషయంలో సరైన బాధ్యత తీసుకోవాలని నిర్ణయించిన సరోజ్ బిడ్డను ఎత్తుకుని మహారాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ శీతాకాల సమవేశాలు నాగ్ పూర్ లో జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణకు చేరుకోగానే మీడియా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆమెను గమనించారు. ఎమ్మెల్యేతో కలిసి కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకోగా, మీడియా ప్రతినిధులు ఆమె న్యూస్ కవర్ చేసేందుకు పోటీ పడ్డారు. మహారాష్ట్ర సీఎం ఎక్ నాథ్ షిండే కూడా ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహేరీ కూతురుకు ఆశీర్వాదాలు అందజేశారు.